ఒకే దెబ్బ కు రెండు పిట్టలు అంటే ఏమిటో … ఆంధ్ర ప్రదేశ్  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఆచరణలో చేసి చూపించే ప్రయత్నాన్ని చేస్తున్నారు . బీజేపీ చేస్తోన్న రాజకీయ విమర్శకులకు చెక్ చెప్పడమే కాకుండా,  ప్రధాని మోడీ ప్రసన్నం చేసుకునేందుకు అయన తన సహజశైలికి భిన్నంగా  రాజకీయ పరిణితిని ప్రదర్శిస్తున్నారు. అక్టోబర్ 15వ తేదీన రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని జగన్మోహన్ రెడ్డి సర్కార్  నిర్ణయించిన విషయం తెలిసిందే . శనివారం ఢిల్లీకి వెళ్తున్న జగన్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాల్సిందిగా ప్రధాని మోడీ ని కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది .


 అయితే ఈ పథకానికి వైయస్సార్ రైతు భరోసా అని పేరు పెట్టడా న్ని  బీజేపీ నేతలు తప్పు పడుతున్నారు . రైతు భరోసా పథకం కింద ఒక రైతుకు 12500   రూపాయలు అందజేయనుండగా,  పిఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద ఏడాదికి ఇచ్చే  6000 రూ.లను  కూడా ఇందులో  కలపనున్నారు .  కేంద్ర ప్రభుత్వ పథకం డబ్బులు తీసుకుని రైతులకు ఇస్తున్నందు వల్ల,  ఈ పథకానికి ప్రధాని మోడీ  పేరుని పెట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.  గతంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా  కేంద్ర  పథకాలకు  పేర్లు మార్చి, తన పేరు   పెట్టుకున్నారని మోడీ , అమిత్ షా తో  సహా పలువురు  బీజేపీ నేతలు విమర్శించిన విషయం తెలిసిందే.


 ఇప్పుడు తనపై కూడా అదే తరహా విమర్శలను  బీజేపీ నేతలు ఎక్కుపెట్టేందుకు  సిద్ధమవుతున్న తరుణంలో వైయస్సార్ రైతు భరోసా పథకానికి ప్రధాని మోడీ పేరును కూడా జత చేయాలని జగన్మోహన్ రెడ్డి యోచిస్తున్నట్లు   తెలుస్తోంది . ఈ విషయాన్ని మోడీ కి తెలియజేసి రైతు భరోసా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరనున్నారని  వైయస్సార్ సిపి వర్గాలు చెబుతున్నాయి.  కేంద్రం నిధులు ఇచ్చిన పథకానికి ప్రధాని పేరు పెట్టడం ద్వారా తనకు చంద్రబాబుకు ఎంతో తేడా ఉందని బిజెపి నేతలకు పరోక్షంగా చెప్పడమే కాకుండా,  వాళ్ళ నోళ్ళు మూయించవచ్చునని   జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: