ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన... సాయంత్రం 4:30 గంటలకు మోదీతో సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని నరేంద్రమోదీని ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆహ్వానించారు. ఈ పథకం ప్రారంభం రోజునే రాష్ట్రంలో కౌలు రైతులతో సహా మొత్తం 53 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని సీఎం వివరించారు.


అలాగే ఈ నెల 15న ప్రారంభమయ్యే రైతు భరోసా పథకం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ప్రధాని మోదీని ఆహ్వానించారు. వెనుకబడిన జిల్లాకు ప్రత్యేకంగా నిధులను విడుదల చేయాలని ఈ భేటీలో ప్రధానిని కోరారు. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా నిధుల ఆదా వివరాలను ప్రధానికి సీఎం వైయస్‌ జగన్‌ ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది.


గంటన్నర పాటు ప్రధానితో సమావేశమైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర సమస్యలపై ప్రధానితో సుదీర్ఘంగా చర్చించారు. రాష్టానికి అదనపు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కోసం విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.61,071.51 కోట్ల రూపాయలు అవసరమవుతాయని గత ప్రభుత్వం ఓటాన్‌ అక్కౌంట్‌ బడ్జెట్లో పేర్కొందని గుర్తు చేశారు. ఈ ఏడాది (2019–20)లో మా ప్రభుత్వం సమర్పించిన పూర్తి స్థాయి బడ్జెట్లో ఇదే విషయాన్ని చెప్పాం... కానీ ఇప్పటి వరకూ కేంద్రం నుంచి వచ్చింది రూ. 6,739 కోట్లు మాత్రమేనని వివరించారు.


గత ప్రభుత్వం వివిధ పనులు, బిల్లులకు సంబంధించి రూ.50 వేల కోట్లు పెండింగ్‌లో పెట్టిందని జగన్ మోడీకి వివరించారు. సకాలంలో నిధులు విడుదల చేసి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. అందుకే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద వీటికి అదనంగా మరో రూ.40 వేల కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: