తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం చేయాలి. గోదావరి నీటిని శ్రీశైలానికి తరలించి రెండు రాష్ట్రాలు వాడుకోవాలి.. ఇదీ కేసీఆర్, జగన్ కొన్నాళ్లుగా ఆలోచిస్తున్న ఉపాయం. దీనిపై ఇద్దరూ ప్రగతి భవన్‌ లో ఇప్పటికే రెండు సార్లు సమావేశమై చర్చించారు. ఇదేదీ ఇద్దరి మధ్య వ్యవహారం కాదని ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు వీరి ఆలోచనను తప్పుబడుతున్నారు.ఈ నేపథ్యంలో తమ ఇద్దరి ఆలోచనను ఒక్కరోజు తేడాతో ఇద్దరూ మోడీ ముందు ఉంచారు.


నిన్నకేసీఆర్ వినిపిస్తే.. ఈరోజు జగన్ ఆ వాదన వినిపించారు. ఏపీ లోని కృష్ణా డెల్టా తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటోందని.. కృష్ణా జలాలపై ఆధారపడిన ప్రాంతాల్లో సాగు నీటిని స్థిరీకరించాల్సి ఉందని ఆయన మోడీకి తెలిపారు. రాయలసీమ ప్రాంతానికి ప్రధానంగా సాగు, తాగు నీటి వనరైన శ్రీశైలం రిజర్వాయర్ కు నీటి సరఫరా గత 52 ఏళ్లుగా చూస్తే 1230 టీఎంసీల నుంచి 456 టీఎంసీలకు పడిపోయిందని తెలిపారు.


మరోవైపు గత 30 ఏళ్లుగా ఏటా సగటున ధవళేశ్వరం వద్ద 2780 టీఎంసీల గోదావరి వరద జలాలు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయని మోడీకి తెలిపారు. గోదావరి నీటిని నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు తరలించడం ద్వారా కృష్ణా డెల్టాను స్థిరీకరించడంతోపాటు, రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు సాగు నీరు సమృద్ధిగా లభించి, ఆర్థికంగా ఆ ప్రాంతం పురోగమించడానికి దోహదపడుతుందని తెలిపారు.


ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మేలుమలుపు తిప్పే గొప్ప ప్రాజెక్టు అని దీనికి మీ సహకారం కావాలని మోడీని జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ దిశగా సంబంధిత మంత్రులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని జగన్ మోడీకి సూచించారు.. మరి కేసీఆర్, జగన్ కంటున్న గోదావరి టు శ్రీ శైలం కలలకు మోడీ ఎంతవరకూ సహకరిస్తారో చూడాలి


మరింత సమాచారం తెలుసుకోండి: