ఆర్టీసీ కార్మికుల సమ్మెపై గుర్రుగా ఉన్న కేసీఆర్.. మరింత కఠినంగా వ్యవహరిస్తానంటున్నారు. అంతే కాదు.. సంస్థను లాభాలబాట పట్టించి.. కొత్తగా చేరిన ఉద్యోగులకు బోనస్‌ లు ఇస్తానంటున్నారు. తాజాగా మంత్రులు, అధికారులతో సమావేశమైన కేసీఆర్.. దురహంకార పూరితంగా సమ్మెకు పోవడానికి కారణం యూనియన్ల మొనాపలీ భావనే కారణం అంటున్నారు.


ఆయన ఇంకా ఏమంటున్నారంటే.. " ఇష్టం వచ్చిన రీతిలో సమ్మె చేస్తామనడం దురహంకారం... ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏ సంస్థలో ఏది జరిగినా అది ప్రభుత్వ అనుమతితోనే జరగాలి.. విధుల్లోకి రానివారు ఆర్టీసీ సిబ్బందిగా పరిగణించనప్పుడు ఇక యూనియన్ల ప్రసక్తే లేదు. యూనియన్లు వాటి అస్తిత్వాన్ని కోల్పోయాయి. భవిష్యత్ లో ఇక ఆర్టీసీలో యూనియనిజం వుండదు.


భవిష్యత్ లో ఆర్టీసీ అంటే ఒక అద్భుతమైన సంస్థగా రూపు దిద్దుకోవడమే.. ఆర్టీసీ భవిష్యత్తులో లాభాలకు వచ్చి కార్మికులకు.. అంటే.. కొత్తగా చేరేవారికి బోనస్ ఇచ్చే పరిస్థితికి రావాలి.సంస్థ లాభాల్లో నడవాలి .. నష్టాల్లోకి పోకూడదు.. ఆర్టీసీకి కొత్త నెత్తురు, జవసత్వాలు రావాలి. రవాణా రంగంలో రోజు రోజుకూ పెరుగుతున్న పోటీ నేపథ్యంలో మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థగా దేశంలోనే పేరుగాంచిన ఆర్టీసి సంస్థ, తన సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తూనే ఆర్థిక పరిపుష్టిని సాధించుకుని లాభాల బాట పయనించడానికి తీసుకోవాల్సిన చర్యల మీద సూక్ష్మ దృష్టి సారించాల్సిన అవసరమున్నది.


ఆర్టీసీ నిరంతరం చైతన్యంతో ప్రజలకు సేవలు అందించే సంస్థ... పండుగలు పరీక్షలు వంటి కీలక సమయాల్లో కార్మిక సంఘాలు సమ్మెలకు పిలుపిచ్చి ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగించే పరిస్థితులు కొనసాగుతున్నాయి. వాటిని రూపుమాపి ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి.. ఆర్టీసీ ప్రక్షాళనకు ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న చర్యలకు ప్రభుత్వాన్ని ప్రజలు ప్రసంసిస్తున్నారు... అంటున్నారు కేసీఆర్. మరి ఆయన వ్యూహం ఎంత వరకూ ఫలిస్తుందో..!


మరింత సమాచారం తెలుసుకోండి: