తెలుగు దేశం పార్టీ నేతల విమర్శలు కాస్త శ్రుతి తప్పుతున్నాయి. ప్రతిపక్షం అన్నాక విమర్శించకుండా ఉంటుందని ఆశించలేం కానీ.. ఆ విమర్శలు వారి స్థాయి దిగజార్చకుండా ఉంటే బావుంటుంది. తాజాగా ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అనేక విమర్శలు చేశారు. అందులో ఓ విమర్శ చాలా వెరైటీగా ఉంది.


ఏపీ సీఎం జగన్ కు వీడియో గేముల పిచ్చి ఉందంటున్నారు దేవినేని ఉమా మహేశ్వరరావు.సీఎంకు ఈ వీడియో గేముల పిచ్చి ఏమిటో అని మంత్రులు కూడా తలపట్టుకుంటున్నారని దేవినేని ఉమా అంటున్నారు. అంతే కాదు.. నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లు ముఖ్యమంత్రి జగన్ వీడియో గేములు ఆడుకుంటూ పాలన గాలికొదిలేశారని దేవినేని ఉమా విమర్శించారు.


మరి ఈ ఆరోపణ గతంలో ఎప్పుడూ వినిపించలేదు. అంతే కాదు..జగన్ వీడియో గేములు ఆడుతున్నట్టు వీడియో ఆధారాలు కూడా లభించలేదు. మరి జగన్ వీడియో గేములు ఆడుకుంటే దేవినేని ఉమా ఎప్పుడు చూశారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అయితే దేవినేని ఉమ మరికొన్ని ఆరోపణలు కూడా చేశారు. తెలుగుదేశం ఏ కార్యక్రమం తలపెడితే పోటీగా అది కాపీ కొట్టడమే వైసీపీ పనిగా మారిందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. తెలుగుదేశం తలపెట్టిన ఛలో ఆత్మకూరు, కోనేరు సెంటర్ లో ధర్నా, డీజీపీ ఫిర్యాదులు కార్యక్రమాలు తామూ చేపడతామని వైసీపీ వస్తోందని దేవినేని ఉమా మండిపడ్డారు.


వైసీపీ నేతలు అధికారంలో ఉన్నామని మర్చిపోయి తమతో పోటీకి వస్తున్నారని దేవినేని ఉమా అంటున్నారు. రాష్ట్రంలో ఇసుక కొరత 30లక్షల మంది పై ప్రభావం పడిందని, వీరికి మద్దతు గా కొల్లు రవీంద్ర దీక్ష తలపెడితే ప్రభుత్వం ఎందుకు భయపడిందని ఉమా ప్రశ్నించారు. కొల్లు రవీంద్ర దీక్షకు మద్దతుగా శనివారం జిల్లా నేతలంతా మచిలీపట్నం వెళ్తున్నామని, అక్కడే జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తామని దేవినేని ఉమా వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: