దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్ లో నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఉన్నతాధికారుల నుండి చిన్న స్థాయి అధికారుల వరకు ఈ స్కామ్ లో అందినకాడికి దండుకున్నారని తెలుస్తోంది. ఏసీబీ విచారణలో వెలుగు చూస్తున్న అంశాలు ఏసీబీ అధికారులనే ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. దేవికారాణి డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రోజు నుండి నకిలీ ఇండెంట్లు, ఇన్ వాయిస్ లు సృష్టించి కోట్ల రూపాయల అవినీతి చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతాయి. 
 
తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశాలు ఇవ్వటంతో సుదీర్ఘ కాలం పాటు జరిపిన విచారణలో విజిలెన్స్ అధికారులు అక్రమాలు నిజమేనని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రభుత్వం ఆ తరువాత ఏసీబీ విచారణకు ఆదేశాలు ఇవ్వగా ఏసీబీ విచారణలో 200 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ప్రాథమికంగా వెలుగులోకి వచ్చింది. 13 మందిని ఇప్పటివరకు ఏసీబీ అధికారులు ఈ కేసులో అరెస్ట్ చేశారు. 
 
ఈఎస్ఐ నిబంధనలకు విరుద్ధంగా మందుల కొనుగోళ్లు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వం 2012 సంవత్సరంలో తెచ్చిన జీవో నెంబర్ 51 ప్రకారం మందుల కొనుగోలు చేయాల్సి ఉన్నా అధికారులు నిబంధనల్ని తుంగలో తొక్కారు. ఫార్మా కంపెనీల అధికారులకు కమీషన్ల ఆశ చూపి ఈఎస్ఐ అధికారులు అక్రమాలు చేసినట్లు తెలుస్తోంది. ఈఎస్ఐ గైడ్ లైన్స్ కు విరుద్ధంగా 50 శాతానికి పైగా మందుల కొనుగోలు జరిగిందని ఏసీబీ విచారణలో వెలుగు చూసింది. 
 
2015 సంవత్సరంలో కొనుగోలు చేసిన మందుల కంపెనీలన్నీ అప్పటికప్పుడు పుట్టుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ఫార్మా కంపెనీలలో మందులు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. వైద్యులకు తెలియకుండానే వైద్యుల పేరుతో బోగస్ ఇండెంట్లను సృష్టించినట్లు ఆ ఇండెంట్లను దేవికారాణి ఆమోదించినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. దేవికారాణికి పలు బినామీ కంపెనీలు కూడా ఉన్నాయని అధికారుల విచారణలో వెలుగులోకి వస్తుంది. 


 
 


మరింత సమాచారం తెలుసుకోండి: