పోరంబోకు భూమి,  వాగును కబ్జా చేసి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారన్న కారణంగా మంగళగిరి తహశీల్ధార్ రాంప్రసాద్, నిర్మాణసంస్థ కు  నోటీసులు జారీ చేశారు.  గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పరిధిలోని ఆత్మకూరు గ్రామం జాతీయ రహదారి వెంట టిడిపి కార్యాలయ భవనం నిర్మిస్తున్న విషయం తెలిసిందే.  తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా నిబంధనలకు విరుద్ధంగా   పోరంబోకు భూమి,  వాగు స్థలాన్ని  కబ్జా చేసి, తమ  పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని చేపట్టిందన్న ఆరోపణలు విన్పించాయి.

 

 తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం  మూడు ఎకరాల అరవై ఐదు సెంట్ల ప్రభుత్వ భూమి కేటాయించగా,  పక్కనే ఉన్న పోరంబోకు భూమి,  వాగు స్థలాన్ని , ప్రైవేటు రైతుల భూములను కూడా కబ్జా చేసి టిడిపి కార్యాలయాన్ని నిర్మిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి . ఈ నేపథ్యంలో టీడీపీ కార్యాలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన రెవెన్యూ అధికారులు ,  పోరంబోకు భూమి, వాగు స్థలాన్ని కబ్జా చేసినట్లుగా నిర్ధారించుకుని కార్యాలయ నిర్మాణం చేప డుతోన్న ప్రయివేట్ కంపెనీకి నోటీసులు జారీ చేశారు .   వారం రోజుల్లో ప్రభుత్వ భూమిలో నిర్మించిన నిర్మాణాలు తొలగించాలని,  లేనిపక్షంలో తామే తొలగిస్తామని తహశీల్ధార్ రాంప్రసాద్  టిడిపి కార్యాలయం నిర్మాణానికి కంపెనీకి జారీ చేసిన నోటీసులతో  పేర్కొన్నారు .


ఇప్పటికే  ఉండవల్లోలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివసిస్తోన్న గెస్ట్ హౌస్ కూడా సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెల్సిందే . కృష్ణానది కరకట్ట పరిధిలో  నదీపరివాహక ప్రాంతం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన లింగమనేని  గెస్ట్ హౌస్ లో చంద్రబాబు నివసించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది . అక్రమ నిర్మాణమని తెలిసి కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి , ప్రతిపక్ష నేత ఎలా నివసిస్తారంటూ వైకాపా నేతలు ప్రశ్నిస్తున్నారు . ఈ వివాదం కొనసాగుతుండగానే , ఇప్పుడు టీడీపీ కార్యాలయం పోరంబోకు , వాగు స్థలాన్ని కబ్జా చేసి నిర్మిస్తున్నారంటూ రెవిన్యూ   అధికారులు నోటీసులు జారీ చేయడం హాట్ టాఫిక్ గా మారింది


మరింత సమాచారం తెలుసుకోండి: