తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌందర్‌రాజన్ సీనియ‌ర్  రాజ‌కీయ‌వేత్త అనే సంగ‌తి తెలిసిందే. తమిళనాడు బీజేపీ శాఖ మాజీ అధ్యక్షురాలు అయిన త‌మిళిసైని ఇటీవ‌ల గ‌వ‌ర్న‌ర్‌గా ఎంపిక చేశారు. అయితే, ఆమె తాజాగా హైకోర్టు మెట్లు ఎక్కడం వార్త‌ల్లో నిలుస్తోంది. డీఎంకే ఎంపీ కనిమొళికి వ్యతిరేకంగా దాఖలుచేసిన ఎన్నికల పిటిషన్‌ను ఉపసంహరించుకొనేందుకు మద్రాస్‌ హైకోర్టును ఆశ్ర‌యించ‌గా...న్యాయ‌స్థానం అనుమతిచ్చింది.


ఇటీవ‌ల జ‌రిగిన లోక్‌సభ ఎన్నికల్లో తమిళిసై తూత్తుకుడి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీచేసి కనిమొళి చేతిలో ఓటమిపాలయ్యారు. దీంతో ఆమెతోపాటు తూత్తుకుడి ఓటర్‌ శంతనకుమార్ ఎన్నికల నామినేషన్‌ పత్రాల్లో కనిమొళి తన భర్తతోపాటు కుమారుని ఆస్తులకు సంబంధించిన కొన్ని వాస్తవాలను దాచిపెట్టారని తమిళిసై ఆ పిటిషన్‌లో ఆరోపించారు. ఈ పిటిషన్లు మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఎం సుబ్రమణ్యం ఎదుట విచారణకు వచ్చాయి. అయితే తెలంగాణ గవర్నర్‌గా రాజ్యాంగ బద్ధమైన పదవిలో నియమితులైనందున తమిళిసై తన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని భావిస్తున్నట్టు ఆమె తరఫు న్యాయవాది తెలియజేయడంతో జడ్జి అందుకు అనుమతించారు. పిటిషన్‌ ఉపసంహరణ నిర్ణయాన్ని ఓ ఆంగ్ల దినపత్రికతోపాటు ఓ తమిళ దినపత్రికలో ప్రచురించాలని ఆదేశిస్తూ విచారణను నవంబర్‌ 11కు వాయిదా వేశారు. త్వ‌ర‌లో ఈ మేర‌కు గ‌వ‌ర్న‌ర్ పిటిష‌న్‌ను ఉప‌సంహరించుకోనున్నారు.


కాగా, తమిళిసై సౌందరరాజన్ పొలిటిక‌ల్ కెరీర్ ఆస‌క్తిక‌రం. పుట్టింది కాంగ్రెస్ కుటుంబంలోనే అయినా.. ఆమె బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. తండ్రి అనంతన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్లమెంట్ మాజీ సభ్యుడు. దీంతో చిన్నప్పటినుంచే ఆమెపై రాజకీయాల ప్రభావం పడింది. అయితే, బీజేపీ వైపు ఆమె ఆక‌ర్షితురాలు మద్రాస్ మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడే విద్యార్థి సంఘం నాయకురాలిగా ఎన్నికయ్యారు. పార్టీలో క్రియాశీల కార్యకర్తగా చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 1999లో దక్షిణ చెన్త్నె జిల్లా వైద్యవిభాగం కార్యదర్శిగా పనిచేశారు. 2001లో వైద్యవిభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2005లో జాతీ య సహ సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించారు. 2010లో తమిళనాడు బీజేపీకి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. 2013లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా వ్యవహరించారు. 2014లో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టారు. అదే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. తమిళనాడులో ఇటీవల జరిగిన జల ఉద్యమంలో ఆమె చురుకైన పాత్ర పోషించారు. తాజాగా ఆమె నేతృత్వంలో తమిళనాడులో 44.5 లక్షల బీజేపీ సభ్యత్వాలు నమోదయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: