అది కాంగ్రెస్ సిట్టింగ్ నియోజకవర్గం.. ఎమ్మెల్యే రాజీనామాతో మళ్లీ ఎన్నికలు వచ్చాయి. మళ్లీ కాంగ్రెస్ గెలిచినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిందేమీలేదు. కానీ ఇప్పుడు ఈ ఎన్నిక అధికార పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. అదే హుజూర్ నగర్ ఉప ఎన్నిక. గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఈసారి తన భార్యను గెలిపించుకుని పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.


కానీ.. అధికార పార్టీ అయి ఉండి ఉప ఎన్నికల్లో ఓడితే అది రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయన్న ఆలోచనతో టీఆర్‌ఎస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. అందుకే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని.. మొదటిసారిగా ఓ రాజకీయ పార్టీ సాయం కోరింది. సీపీఐ మద్దతు అడిగింది. అందుకు ఎర్రన్నలూ మొదట సరే అన్నారు.


కానీ ఆర్టీసీ సమ్మెతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. సమ్మెపై సర్కారు తీరును నిరసిస్తూ సీపీఐ మద్దతు ఉపసంహరించుకుంది.. దీంతో రాజకీయం రసకందాయంలో పడింది. అసలే కాంగ్రెస్ నియోజకవర్గం.. అందులోనూ ఆర్టీసీ సమ్మెతో ప్రభుత్వ వ్యతిరేక గాలి కనిపిస్తోంది. ఈ ఎన్నిక ఎక్కడ కొంప ముంచుతుందో అన్న ఆందోళన టీఆర్ఎస్ లో కనిపిస్తోంది.


గెలుపు నల్లేరుపై నడకే అని మొదట భావించిన టీఆర్ఎ , కాంగ్రెస్‌ మారిన పరిస్థితులు.. మారుతున్న సమీకరణలతో సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించడంతో ఆర్భాటపు ప్రచారం జోలికి పోవడంలేదు. ఇంకా ప్రచారానికి నాలుగురోజుల గడువే మిగిలి ఉంది. అయితే ప్రచరాం మాత్రం పెద్దగా కనిపించడం లేదు. అక్కడక్కడ తిరిగే ప్రచార వాహనాలు మినహా అసలు ఎన్నికలు జరుగుతున్నట్లే లేదు.


ఊరూవాడా రెపరెపలాడే జెండాల స్థానంలో అక్కడక్కడ ఒకటి రెండు జెండాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా.. ఆ తర్వాత జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తిరుగులేని అధిక్యాన్ని సాధించిన టీఆర్ఎస్ సాధించింది. కాంగ్రెస్ కూడా శాసనసభ ఎన్నికల్లో 7,466 ఓట్ల ఆధిక్యంతో నెగ్గిన ఉత్తమ్‌ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 12,993 ఆధిక్యాన్ని సాధించడంతో గెలుపుపై విశ్వాసంతో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: