నాలుగు నెలల కిందట అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత జగన్.. తన ఎన్నికలహామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. ఆయన చేసిన తొలి వాగ్దానం రైతు భరోసా.. మంగళవారం పట్టాలెక్కింది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఏడాదికి ఓ వేయిరూపాయలు ఎక్కువే ఇచ్చేందుకు జగన్ నిర్ణయించారు. కాకపోతే ఆ సొమ్మును విడతలవారీగా ఇవ్వాలని నిర్ణయించారు.


అయితే రైతుకు అందించే సాయం వేయి రూపాయలు పెంచడాన్ని పెద్దగా పట్టించుకోని విపక్షాలు.. విడతలవారీగా సాయం ఇవ్వడాన్ని తప్పుబడుతున్నాయి. అంతే కాక.. కేంద్రం ఇచ్చే సాయంతో కలుపుకుని ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ విషయంలోనూ కూడా తోటి ప్రతిపక్షం టీడీపీనే ఫాలో అయ్యారు. మీడియా ముందుకు రాకపోయినా.. అసంపూర్ణంగా మిగిలిన రైతు భరోసా వాగ్దానం.. అంటూ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.


రైతు భరోసా పధకాన్ని కేంద్ర పథకమైన కిసాన్ యోజన పథకంతో ముడిపెట్టి అమలు చేస్తున్నజగన్ తన ఎన్నికల వాగ్దానానికి సంపూర్ణత్వం సాధించలేకపోయారని జనసేనపార్టీ భావిస్తోందని అందులో పేర్కొన్నారు. ప్రతీ రైతు కుటుంబానికి 12500 రూపాయలను ప్రతి ఏటా అందిస్తామని తన నవరత్నాలలోను, ఎన్నికల ప్రణాళికలోను ఘనంగా ప్రకటించిన జగన్ రెడ్డి గారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కిసాన్ యోజన పథకంలోని ఆరువేల రూపాయలను కలిపి 13500 రూపాయలను ఇవ్వడం ఎంతవరకు సమంజసం ? అని ప్రశ్నించారు. మీరు నవరత్నాల ప్రకటన విడుదల చేసినప్పుడు రైతు భరోసాను కేంద్ర ప్రభుత్వం సాయంతో ఈ పథకాన్ని రూపొందిస్తామని ఎందుకు చెప్పలేదు ? అని ప్రశ్నించారు.


ఎన్నికల మేనిఫెస్టోలో ఏటా 12500 రూపాయలు ఇస్తామని జగన్ చెప్పారు. ఇప్పుడు అలాగే ఇస్తున్నారు. కాకపోతే విడతలవారీగా ఇస్తామని ముందుగా చెప్పలేదు. ఈ మాత్రం దానికే వాగ్దాన భంగం జరిగిందని జనసేనాని గింజుకోవడం ఆశ్చర్యం కలిగించక మానదు. ఎందుకంటే.. 2014లో తానే స్వయంగా ప్రచారం చేసిన చంద్రబాబును అధికారంలోకి తెచ్చిన పవన్.. చంద్రబాబు ఎన్నికల హామీలను పట్టించుకోనప్పుడు పవన్ ఏనాడూ నిలదీసిన పాపాన పోలేదు.


2014 ఎన్నికల ప్రచారంలో కానీ.. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ చంద్రబాబు ఇవ్వని హామీ లేదు.. కానీ అధికారంలోకి వచ్చాక.. ఏ ఒక్క హామీనీ సంపూర్ణంగా అమలు చేయలేదు. కానీ ఏనాడు ఆ హామీలపై నోరెత్తని పవన్ కల్యాణ్..ఇప్పుడు జగన్ తన మొదటి హామీని అమలు చేస్తున్నా.. కేంద్ర సాయం కలపడమేంటి.. విడతలుగా ఇవ్వడమేంటని తెలుగుదేశం పాటనే తన నోట పాడుతున్నారు. ఈ తేడాను జనం అర్థం చేసుకోకమానరు.


మరింత సమాచారం తెలుసుకోండి: