హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్రంలోని చార్కి దాద్రిలో జరిగిన బహిరంగ సభలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ‘‘హిమాలయ నదుల్లో మనకు దక్కాల్సిన నీళ్లలో మెజార్టీ వాటాను పాకిస్తాన్​ వాడుకుంటోంది. ఈ తంతు 70 ఏండ్లుగా జరుగుతున్నా గత ప్రభుత్వాలేవీ పట్టించుకోలేదు. ఇకపై ఈ ఆటలు సాగనివ్వం. పాక్​కు వెళ్లే మన నీళ్లను ఆపేస్తాం’’అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఆ నీళ్లను హర్యానా, రాజస్థాన్​కు తరలిస్తామని, ఈ పోరాటానికి తానే నాయకత్వం వహిస్తానని, నీళ్లు రప్పించే పూచీ తనదేనని హర్యానా రైతులకు ప్రధాని హామీ ఇచ్చారు. 


రెండు రోజుల హర్యానా ఎన్నికల పర్యటనలో భాగంగా చర్ఖిదాద్రి, తానేసార్‌ పట్టణాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ప్ర‌ధాన‌మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోశారు. ‘ఆర్టికల్‌ 370 రద్దుపై కొందరు కాంగ్రెస్‌ నాయకులు భారత్‌లోనే గాకుండా విదేశాల్లో కూడా పుకార్లను వ్యాప్తి చేస్తున్నారు. మీరు(కాంగ్రెస్‌) మోదీని నిందించండి. నన్ను తిట్టడానికి కొత్త పదాలు కావాలంటే బ్యాంకాక్‌, థాయిలాండ్‌, వియత్నాం నుంచి దిగుమతి చేసుకోండి. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే, అభివృద్ధి బాటలో పయనిస్తున్న భారత్‌ను వెన్నుపోటు పొడవడం ఆపేయండి’ అని అన్నారు. 


హర్యానా, మహారాష్ట్రలో పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ.. దేశం ఈసారి రెండు దీపావళులు చూడబోతున్నదని, ఒకటి దీపాల పండుగైతే, రెండోది బీజేపీ విజయానికి గుర్తుగా కమలం పూలతో జరుపుకునేదని మోడీ చెప్పారు.ఒకవేళ ప్రజలు కాంగ్రెస్‌కు అధికారాన్ని కట్టబెడితే, తాము రద్దు చేసిన కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించే దమ్ము ఆ పార్టీకి ఉన్నదా? అంటూ మరోసారి ప్రశ్నించారు. ఆర్టికల్‌ 370 రద్దుకు యావత్‌ జాతి సంఘీభావాన్ని తెలిపిందని అన్నారు. . ‘‘హర్యానా ఆడబిడ్డల సత్తా ప్రపంచానికి చాటిన ‘దంగల్​’సినిమాను తాను కూడా చూశానని చైనా ప్రెసిడెంట్​ జిన్​పింగ్​ నాతో చెప్పారు. ఆ క్షణం నేను చాలా గర్వంగా ఫీలయ్యా’’అని ప్రధాని తెలిపారు. ప్రధాని నరేంద్ర  మోడీ మాటలకు బబిత సంతోషంతో కన్నీళ్లు పెట్టారు. బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్​ హర్యానాలో బాగా సక్సెస్​ అయిందని, ఇంత బాగా పనిచేసిన మనోహర్​ లాల్​ ఖట్టర్​నే మరోసారి సీఎంగా గెలిపించాలని మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా, ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌టించిన‌ట్లు నిజంగా పాక్‌కు ద‌క్కే నీటిని భార‌త్‌కు ర‌ప్పిస్తే...మ‌న‌దేశ ప్ర‌జ‌ల‌కు, రైతుల‌కు ఎంతో మేలు ద‌క్కుతుంద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: