మావోయిస్టుల కన్ను మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై పడిందా? గోదావరి తీరప్రాంతం మావోయిస్టులకు ఇప్పుడు అడ్డాగా మారిందా? తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో అలజడి సృష్టించేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారా? రెండు రాష్ట్రాల పోలీసులు సమావేశం కావటానికి కారణం ఏంటి? ఇన్ ఫార్మర్ల నెపంతో అమాయకులను చంపటం వెనుక మావోయిస్టుల ఉద్దేశం ఏంటి? రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణానికి కారణమేంటి?


తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో మళ్లీ మావోయిస్టుల అలజడి మొదలైంది. గత వారం రోజులుగా మావోయిస్టులు గోదావరి నదీ తీర ప్రాంతం ఛత్తీస్‌గఢ్, మహదేవ్‌పూర్‌లో మకాం వేసినట్టు ప్రచారం జరుగుతోంది. గత శుక్రవారం అర్ధరాత్రి మహదేవ్‌పూర్ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న దుద్దేడ గ్రామానికి చెందిన పేరింట్ల కిష్టయ్య అనే వ్యక్తిని మావోయిస్టులు హత్య చేశారు. ఈ హత్యతో రెండు రాష్ట్రాల పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మహదేవ్‌పూర్ అడవులను మావోయిస్టులు షెల్టర్ జోన్‌గా వాడుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పోలీసులు అప్రమత్తం అయ్యారు. 


పోలీస్ ఇన్ ఫార్మర్ వ్యవస్థ ద్వారా చాలా మందిని కోల్పోతున్న మావోయిస్టులు ప్రస్తుతం వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ, మహరాష్ట్ర, చత్తీస్ గడ్ రాష్ట్రాల సరిహద్దు గోదావరి, ఇంద్రావతి, ప్రాణహిత నదులు దాటేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చత్తీస్‌గడ్ సుక్మాలోని కిష్టారం సమీపంలోని సీఆర్పీఎఫ్ క్యాంప్ పరిసరాల్లో మావోయిస్టులు డ్రోన్ సహయంతో భద్రతా బలగాల కదలికలను తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. 


మరోవైపు...రెండు రాష్ట్రాల సరిహద్దులో మావోయిస్టుల కదలికలు పెరిగాయనే సమాచారంతో మహారాష్ట్ర పోలీసులు తెలంగాణ పోలీసులతో భేటీ అయ్యారు. మహారాష్ట్రలో ఈనెల 21న పోలింగ్‌ జరగనుండటంతో అక్కడి పోలీసులు అలర్ట్ అయ్యారు. పకడ్బందీగా భద్రత నిర్వహించేందుకు సహకరించాలంటూ తెలంగాణ జిల్లాల పోలీసులను కోరారు. 


అటు... గడ్చిరోలి జిల్లా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై నిఘాను పెంచారు పోలీసులు. ఎన్నికలు ముగిసే వరకు సరిహద్దు ప్రాంతాల్లోని ఇరు రాష్ట్రాల పోలీసు అధికారులు సమస్వయంగా పని చేయాలని సూచించారు. మావోయిస్టుల కదలికలతో పాటు డబ్బు, మద్యం గడ్చిరోలి జిల్లాకు తరలి రాకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ జిల్లాల పోలీసులను మహారాష్ట్ర పోలీసులు కోరారు. మొత్తంగా అటు మహారాష్ట్ర ఎన్నికలు ఇటు తెలంగాణలో మళ్ళీ మావోయిస్టుల కదలికలతో  గోదావరి తీరం...అటవీ గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: