టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీజేపీ తేల్చేసింది. జాతిపిత 150వ జయంతి సందర్భంగా .. దేశవ్యాప్తంగా గాంధీ సంకల్ప యాత్ర చేపట్టింది కాషాయ పార్టీ. ఏపీ సమస్యలపై గ్రీవెన్స్ సెల్ పెడితే.. వైసీపీకి వచ్చిన ఓట్ల కంటే ఎక్కుక అప్లికేషన్లు వస్తాయని బీజేపీ సెటైర్లు వేస్తోంది. టీడీపీ, వైసీపీ నాణానికి రెండు ముఖాలంటున్న కాషాయ పార్టీ.. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమంటోంది. 


వంద ఎలుకల్ని తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్లినట్టుగా చంద్రబాబు తీరు ఉందన్నారు ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సునీల్ దేవ్ ధర్. పార్లమెంట్ ఎన్నికల ముందు పీఎం కావాలని కలలు కన్న చంద్రబాబు.. ఇప్పుడు తీరిగ్గా ఎన్డీఏ నుంచి బయటికొచ్చి తప్పుచేశానని విచారపడుతున్నారని సెటైర్లు వేశారు. ఎన్టీఆర్ నేతృత్వంలో గొప్ప పార్టీగా ఉన్న టీడీపీని చంద్రబాబు దిగజార్చారని ఆరోపించారు. భవిష్యత్తులో చంద్రబాబుతో పొత్తు ప్రసక్తే లేదని తేల్చేశారు. 


ఏపీ సర్కారు వైఫల్యాలను ఎండగట్టడంలో టీడీపీ విఫలమయిందని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి విమర్శించారు. జగన్‌ను టార్గెట్ చేయడం మానుకుని,  సమస్యలపై ఫోకస్ చేయాలని ఆయన ఆ పార్టీకి సూచించారు. రివర్స్ టెండరింగ్‌పై  కేంద్ర ప్రభుత్వం ఎన్ని అభ్యంతరాలు వ్యక్తంచేసినా జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సుజనా ఆరోపించారు. 


విశాఖజిల్లా పాయకరావుపేట నుంచి బీజేపీ తలపెట్టిన గాంధీ సంకల్పపాదయాత్రను ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ ప్రారంభించారు. మహాత్ముడి ఆదర్శాలకు అనుగుణంగా ప్రధాని మోదీ పాలన సాగుతోందని కన్నా చెప్పారు. బాపూజీ కలలను సాకారం చేసేందుకు సంపూర్ణ గ్రామీణ అభివ్ర్రద్ధి ధ్యేయంగా కేంద్రం ముందడుగు వేస్తోందన్నారు. 


మొత్తానికి టీడీపీతో పొత్తుపై భారతీయ జనతా పార్టీ క్లారిటీ ఇచ్చేసింది. ఒకప్పుడు చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఆ పార్టీ నేతలు ఇపుడు ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. ప్రత్యేక హోదాపై బీజేపీ వైఖరిని నిరసిస్తూ చంద్రబాబు ఎపుడైతే వెనక్కి తగ్గారో అప్పటి నుంచి టీడీపీ, బీజేపీకి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవల కొందరు టీడీపీ నేతలను ఆకర్షించిన బీజేపీ తమ పార్టీలో చేర్చుకుంది. ఇపుడు ఆ నేతలే టీడీపీ వైఖరిని ఎండగడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: