‘కేసీఆర్ కార్మిక వ్యతిరేకి,  ఇద్దరు ఆర్టీసీ కార్మికుల చావుకి కారణం, ఒక అసమర్థుడు... అలాంటి దుర్మార్గుల్ని కలవొద్దని కోరుతున్నా అంటూ  ఓ తెలంగాణ ఎంపీ, ఏపీ సీఎం జగన్ కి సలహా  ఇచ్చారు. ఆర్టీసీ సమ్మె పట్ల సీఎం కేసీఆర్ వైఖరిని విపక్షాలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ను తిడుతూనే...   ఏపీ సీఎం జగన్‌కు పలు సలహాలు సూచనలు కూడా ఇచ్చారు.  మీరు కేసీఆర్ తో కలవవద్దు. మీరు కలిస్తే మీ పేరు, మీ నాన్న పేరు కూడా చెడిపోతాయి’ అని జగన్ కు సూచించారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి. 

ఆర్టీసీ సమ్మె విషయంలో స్పందించిన ఆయన.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికి ఆర్టీసీని ప్రభుత్వంలో జగన్ విలీనం చేశారని కొనియాడారు. వయస్సులో కేసీఆర్ కంటే చిన్నవాడైనప్పటికీ కార్మికులకు మేలు చేసే నిర్ణయం తీసుకున్నారంటూ జగన్మోహన్ రెడ్డిని ప్రశంసించారు. తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉన్నప్పటికి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేకపోతున్నారని కేసీఆర్‌ను విమర్శించారు కోమటి రెడ్డి.

వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని చురకలంటించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలకు కేసీఆర్‌కు పట్టవా అని ప్రశ్నించారు కోమటిరెడ్డి. ఆర్టీసీ డ్రైవర్లు బలి దానాలు చేసుకున్నా కనీసం స్పందించకపోవడం దారుణం అన్నారు.ఇబ్రహీంపట్నం డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించిన కోమటిరెడ్డి వారికి సంఘీభావం తెలిపారు.ఆర్టీసీ కార్మికులు ధైర్యంగా ఉండాలని.. తాము అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

కేసీఆర్ నెలకోసారి జగన్‌మోహన్‌రెడ్డిని పిలిపించుకొని.. ఆయనేదో గెలిపించుకున్నట్లు ఫీలవుతున్నారని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేసిన సేవలు.. జగన్ పడిన కష్టంతోనే ఎన్నికల్లో విజయం సాధించారని.. కేసీఆర్ బతికున్నా కూడా బిడ్డను గెలిపించుకోలేకపోయిన అసమర్థుడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: