విశాఖపట్నంలో ప్రజా ప్రయోజనాలకు విరుద్దంగా కేటాయించినందునే ఆ భూముల విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య(నాని) తెలిపారు. ఆమోద పబ్లికేషన్స్‌కు భూకేటాయింపును బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రద్దు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి నాని వెల్లడించారు. ఆంధ్రజ్యోతి కోసం ఆమోద పబ్లికేషన్స్ పేరిట విశాఖలోని పరదేశి పాలెంలో ఒకటిన్నర ఎకరా భూకేటాయింపును  ఏపీ కేబినెట్ రద్దు చేసిందన్నారు. రూ.40 కోట్ల విలువ చేసే భూమిని రూ.50.05 లక్షలకే గత ప్రభుత్వం ఆమోద పబ్లికేషన్స్‌కు ఇచ్చిందని చెప్పారు. 


ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా జరిగినందుకే 2017 జూన్ నాటి కేటాయింపులు రద్దు చేయాలని కాబినెట్ నిర్ణయించినట్టు మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి కేటాయించిన స్థలంలో నిర్మాణాలేవీ జరగలేదని చెప్పారు. ఇదిలా ఉండగా ఏపీ కేబినెట్ ఆరోపణలను ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఖండించింది. గత ప్రభుత్వం అప్పనంగా భూమి కేటాయించిందనడం అవాస్తవమని స్పష్టం చేసింది. చంద్రబాబు ప్రభుత్వం భూకేటాయింపులు చేయలేదని ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. 1986లో నాటి ఆంధ్రజ్యోతికి చట్టబద్ధంగా అప్పటి ప్రభుత్వం ఎకరన్నర భూమి కేటాయించినట్టు స్పష్టం చేసింది. తర్వాత కొన్నాళ్లకు జాతీయ రహదారి విస్తరణ కోసం ఆంధ్రజ్యోతి ఆధీనంలోని ఓ ఎకరం భూమిని ప్రభుత్వం తీసుకుందని చెప్పింది. నాడు రహదారి విస్తరణ కోసం తీసుకున్న భూమికి పరిహారంగానే 2017లో పరదేశి పాలెంలో ఎకరంన్నర భూమి కేటాయింపు చేసినట్టు ఆంధ్రజ్యోతి యాజమాన్యం వెల్లడించింది.




పరిహారంగానే చేసిన భూకేటాయింపునకు నిజానికి సొమ్ము చెల్లించనక్కర్లేదని చెప్పింది. అయినా కలెక్టర్ నివేదికకు లోబడి పరదేశి పాలెంలో ఎకరంన్నర భూమికి రూ.50 లక్షల 5వేలు చెల్లించినట్టు తెలిపింది. ఇప్పుడు ఆ భూమి విలువ కూడా రూ.2 కోట్ల 33 లక్షల 22 వేలు మాత్రమేనాని చెప్పింది. ప్రభుత్వం చెబుతున్నట్టుగా రూ.40 కోట్లు కానే కాదని చెప్పడం గమనార్హం. 80వ దశకం నాటి భూమికి పరిహారంగా 2017లో చేసిన కేటాయింపులపై అవాస్తవాలు చెప్పడాన్ని ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఖండించింది. రాజకీయ దురుద్దేశాలు ఎవరికి ఉన్నాయో.. న్యాయబద్ధమైన కేటాయింపులను రద్దు చేయడంలోనే అర్థమవుతోందని ఆంధ్రజ్యోతి యాజమాన్యం ధ్వజమెట్టుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: