హాట్ హాట్‌గా సాగుతున్న హ‌ర్యానా ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి షాకుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఓవైపు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో సుడిగాలి ప‌ర్య‌ట‌న చేస్తూ...దూసుకువెళ్తుంటే...కాంగ్రెస్‌కు ఆ పార్టీకి చెందిన ముఖ్య‌నేత‌లే షాకులు ఇస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన హర్యానా కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు అశోక్‌ తన్వర్‌ మరో బాంబు పేల్చారు. త్వరలో జరుగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో దుశ్యంత్‌ చౌతాలా నేతృత్వంలోని జననాయక్‌ జనతా పార్టీ (జేజేపీ)కి మద్దతు తెలుపుతున్నట్లు ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు. దీంతో కాంగ్రెస్ గెలుపుపై సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని నిపుణులు పేర్కొంటున్నారు.


జననాయక్‌ జనతా పార్టీ (జేజేపీ) నేత‌ దుశ్యంత్‌ చౌతాలాతో క‌లిసి విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడిన  హర్యానా కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు అశోక్‌ తన్వర్ ఈ సంద‌ర్భంగా పార్టీలోని ప‌రిణామాల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్‌లో అహంకారం గల వ్యక్తులు కొందరు ఉన్నారని, కాబట్టి తన మద్దతుదారులందరూ ఆ పార్టీని మరచిపోవాలని కోరారు. తాను కాంగ్రెస్‌ నుంచి ఆవేదనతోనే బయటికి వచ్చానని తెలిపారు.  ఎన్నికల్లో తమ మద్దతు జేజేపీకి ఉంటుందని తెలిపారు. తన అనుచరులు, మద్దతుదారుల సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు త‌న్వ‌ర్ వివ‌రించారు.


ఇదిలాఉండ‌గా, కాంగ్రెస్ స‌హా విప‌క్షాల తీరును మోదీ ఎద్దేవా చేస్తున్నారు. హర్యానా ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ  బల్లబ్‌గఢ్‌లో జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. బీజేపీకి బలమైన జట్టు, పటిష్ఠమైన కెప్టెన్‌ ఉన్నాడని, ప్రతిపక్షాలు మాత్రం ఐక్యమయ్యే ప్రయత్నంలో కూలిపోతున్నాయని ఎద్దేవా చేశారు. తాము తీసుకున్న నిర్ణయం వల్ల నేడు జమ్ముకశ్మీర్‌, లడఖ్‌ ప్రాంతాలు అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రతిష్ఠ కేవలం మోదీ ఒక్కడిది కాదని, మొత్తం 130 కోట్ల దేశ ప్రజలదన్నారు.ఆర్టికల్‌ 370ని రద్దు చేయడాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మోదీ ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: