ఒకే ఒక ఉప ఎన్నిక మొత్తం జాతకాలు మార్చేస్తుందా. ఒక్క మెతుకు చాలు మొత్తం అన్నం ఉడికిందో లేదో చెప్పేందుకు అంటారు. మరి 119 అసెంబ్లీ సీట్లు ఉన్న చోట దాదాపు ఏడాది పాలనను పూర్తిచేసుకుంటున్న టీయారెస్ సర్కార్ విషయంలో ప్రజల తీర్పు ఏం చెప్పనుంది. మేము వచ్చేస్తున్నామంటున్న విపక్ష బీజేపీ, కాంగ్రెస్ తొడకొట్టుడు రాజకీయానికి ఎలాంటి జవాబు వస్తుంది. జీ హుజూర్ అనేది ఎవరికి. ఏమా కధ.. ఉప పొరులో ప్రజలు ఝ‌లక్ ఇస్తే అలా ఇలా ఉండదుగా


హుజూర్ నగర్ ఇపుడు అధికార టీయారెస్ గుండెల్లో గుబులు రేపుతోంది. అలా ఇలా కాదు ఏకంగా తడిసిముద్దవుతోంది పార్టీ మొత్తం. అసలే  ఉత్తర తెలంగాణాలో టీయారెస్ కి పట్టు తక్కువ. రెండు సార్లు అధికారంలోకి వచ్చినా కూడా అక్కడ గట్టిపరచుకోవడం కష్టమైపోతోంది. కేసీయార్ మార్క్ విన్యాసాలతొ విపక్షాన్ని ఎంతలా  ఇరుకున పెడుతున్నా కూడా  అసలైన అధిదేవతలు ప్రజలే కాబట్టి వారు తీర్పు  ఎలా అన్నది ఇపుడు టీయారెస్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది.


నిజానికి టీయారెస్  సర్కార్ రెండవ దఫా అధికారం చేపట్టాక కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే వ్యతిరేకత వచ్చిపడింది. అందుకే సారూ పదహారు అంటూ ఎంపీ ఎన్నికలకు వెళ్ళిన టీయారెస్  కి తొమ్మిది సీట్లే దక్కాయి. అనూహ్యంగా బీజేపీ పుంజుకుని నాలుగు ఎంపీ సీట్లు లాగేసింది. ఇపుడు కూడా ఉత్తర తెలంగాణాలో బీజేపీ బలం ఉంది. కాంగ్రెస్ కి పట్టు ఉంది. అధికార పార్టీ అన్న ఎడ్జి తప్ప టీయారెస్ కి ఇపుడు అన్నీ ప్రతికూలతలే.


పైగా ఆర్టీసీ సమ్మె విషయంలో సర్కార్ తీసుకుంటున్న మొండి  నిర్ణయాలు ఇటు కార్మికులనే కాదు, అటు ప్రజలకు కూడా ఆగ్రహం తెప్పించేలా ఉన్నాయి అంటున్నారు. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు టీయారెస్ కి మద్దతు ఇచ్చి కూడా సీపీఐ వెనక్కి పోయింది. అక్కడ సీపీఐకి కచ్చితంగా అయిదారువేల పై చిలుకు ఓట్లు ఉన్నాయి. దాంతో ఒడ్డున పడుదామనుకున్న టీయారెస్ కలలు కల్లలు అయ్యేలా ఉన్నాయి.


మొత్తానికి జరగరానిది జరిగి టీయారెస్ కనుక ఓటమిపాలు అయితే ఒక్కసారిగా తెలంగాణా రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారడం ఖాయమంటున్నారు. అపుడు జరిగే పరిణామాలు వేగంగా ఉంటాయి. ఎలాగైనా స్టీరింగ్ తిప్పుతాననని జబర్దస్త్ చేసే కారు సారుకి కంగారే పుడుతుందని కూడా అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

trs