అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మూలంగా భార‌తీయుల‌కు ఓ రేంజ్‌లో క‌ష్టాలు ఎదుర‌వుతున్నాయి. స్వదేశీయులకే ఉపాధి అవకాశాలు అని, ఎన్నారైలలో అత్యంత ప్రతిభావంతులకే  అవకాశం అంటూ చెబుతున్న ట్రంప్‌ తన విదేశీవిధానంలో మార్పు చేయడం లేదు. ఎన్నికల్లో గెలిచింది మొద‌లు...ఆయన స్థానిక జ‌పం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అక్ర‌మ వ‌ల‌స‌ల‌ను ఆశ్ర‌యంగా చేసుకున్నారు. ఇందుకు మెక్సికో స‌రైన మార్గంగా భావిస్తున్నారు.  అక్ర‌మ వ‌ల‌స‌ల విష‌యంలో అమెరికానుంచి ఎదురవుతున్న ఒత్తిళ్ల కారణంగా వివిధ ప్రాంతాల్లో సరిహద్దులు దాటి తమ దేశంలోకి ప్రవేశిస్తున్న వారిని అరికట్టే క్రమంలో మెక్సికో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు చర్యలు చేపట్టి అక్ర‌మ వ‌ల‌స‌ల‌పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీనిలో భాగంగా భారత్‌కు చెందిన 311 మందిని తిరిగి స్వదేశానికి పంపించేశారు. 


అమెరికాలో నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలనే కొందని ఆశను ఏజెంట్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అంతార్జతీయ ఎజెంట్ల ద్వారా భారతీయులు అక్రమంగా అమెరికా వెళ్లటానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకు గాను ఒక్కొక్కరూ 25 నుంచి 30 లక్షలు చెల్లిస్తున్నారు. ఇందులో భాగంగా..అక్రమంగా మెక్సికో ద్వారా అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. అయితే, అమెరికా ఒత్తిడి నేప‌థ్యంలో మెక్సికిలో అక్ర‌మంగా నివసిస్తున్న వారిపై ఆ దేశం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. తాజాగా భారత్‌కు చెందిన 311 మంది అక్రమ వలసదారులను ఆ దేశం తిరిగి భారత్‌కు పంపించేసింది. టొలుకా నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయంనుంచి వారిని ఢిల్లీకి పంపించివేసినట్లు నేషనల్‌ మైగ్రేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ తెలిపింది.


ఇలా పంపించిన వారిలో ఒక మహిళ కూడా ఉంది. ఇండియన్లను వెనక్కి పంప‌డం వెనుక ప్ర‌త్యేక‌మైన ఒత్తిళ్లు ఏవీ లేవ‌ని, నిబంధ‌న‌ల మేర‌కు అక్ర‌మ వ‌ల‌స‌ల‌ను అరిక‌డుతున్నామ‌ని మెక్సికో ప్రభుత్వం ప్ర‌క‌టించింది. అర్హులైన వారు త‌మ దేశంలో నివ‌సించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని పేర్కొంటూ...నిబంధ‌న‌లు పాటించ‌ని వారి విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: