ప్రపంచంలో అతి శక్తివంతమైన నేతల్లో మన ప్రధాని మోడీ ఒకరు. ఇక భారతదేశంలో మోడీకి తిరుగులేదు. అందుకే కదా గత మే లో వెలువడిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఊహించని స్థాయిలో పార్లమెంట్ సీట్లు గెలుచుకుని రెండోసారి కేంద్రంలోకి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల ఫలితాలపై ఆ పార్టీ నేతలు గత కొన్ని నెలలుగా డప్పు కొడుతూనే ఉన్నారు. మొత్తం మోడీ గాలి వీచింది...సునామీలా సీట్లు సాధించాం అంటూ మోడీపై పొగడ్తల వర్షం కురిపించారు.


అయితే ఈ మోడీ గాలి ఐదు నెలల్లోనే తగ్గిపోయినట్లు కనిపిస్తోంది. దానికి ఉదాహరణే తాజాగా జరిగిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.  ఎన్నికల ముందు వరకు ఈ రెండు చోట్ల బీజేపీనే అధికారంలో ఉంది. ఇక ఈ సారి కూడా బీజేపీనే బంపర్ మెజారిటీతో అధికారంలోకి రాబోతుందని ప్రచారం చేసేసుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రావడమే ప్రధాని మోడీ, వ్యూహకర్త అమిత్ షాలు కాళ్ళకు బలపం కట్టుకుని రెండు రాష్ట్రాల్లో ప్రచారం చేశారు.


దేశంలో ఉన్న నిరుద్యోగ, రైతుల సమస్యలు, నోట్ల రద్దు వల్ల ఇంకా ఇబ్బందులు పడుతున్న చిన్న పారిశ్రామిక వేత్తలు, వీటితో పాటు ఆయా రాష్ట్రాల్లో ఉన్న సమస్యలు ఇవేమీ పట్టించుకోకుండా కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, సర్జికల్ దాడులు చేశామని ఓ డప్పు కొట్టేశారు. దీని వల్లే ఏకపక్షంగా విజయం సాధించాల్సిన మహారాష్ట్రలో శివసేనతో కలిసి పోటీ చేసి కష్టపడి మ్యాజిక్ ఫిగర్ దాటారు. 288 సీట్లు గల మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ 145. ఇక బీజేపీ-శివసేన కలిపి 162 సీట్లు తెచ్చుకున్నాయి.


అటు కాంగ్రెస్-ఎన్‌సి‌పి కలిపి 96 సీట్లు వరకు గెలుచుకున్నాయి. అయితే కాంగ్రెస్ లో నాయకత్వ లేమి, ఎన్నికల్లో ఎం‌ఐ‌ఎం పార్టీ కాంగ్రెస్ ఓట్లని చీల్చడం వల్ల బీజేపీ-శివసేనలు బయటపడ్డాయి. లేదంటే అంతే సంగతులు. ఇక గతంలో కంటే హర్యానాలో బీజేపీ దారుణంగా సీట్లు కోల్పోయింది.  90 సీట్లు ఉన్న హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ 46. కానీ బీజేపీ 40 సీట్లు దగ్గర ఆగిపోయింది. అటు కాంగ్రెస్ 31 సీట్లు సాధించగా, జే‌జే‌పి 10, ఇతరులు 9 చోట్ల విజయం సాధించారు.


ఇక్కడ కాంగ్రెస్ కొంచెం కష్టపడి ఉంటే బీజేపీకి చెక్ పెట్టేసేది. ఇప్పుడు హాంగ్ రావడంతో జే‌జే‌పి కీలకంగా మారింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు బీజేపీకి ఎక్కువగా ఉన్నా, కాంగ్రెస్ కూడా వెనక్కి తగ్గడం లేదు. జే‌జే‌పి కి సీఎం పదవి ఇచ్చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తుంది. మొత్తానికి సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఇప్పటికీ మోడీ గాలి తగ్గినట్లే చెప్పొచ్చు. ఇప్పటికైనా జాతీయ సమస్యలని రాష్ట్రాలపై రుద్దకుండా ఉంటే బాగుటుంది. రాష్ట్రాల్లో ఉండే రైతుల, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తే ప్రజల్లో సానుకూలత ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: