తమ ప్రమేయం లేకుండానే కొందరు పరిస్ధితుల ప్రభావం వల్ల ఇరుక్కుపోతారు. ఇలాంటి పరిస్దితే ఇపుడు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఎదురైంది. వైసిపిలో ఉండాలా ? లేకపోతే ఉనికి కూడా లేని జాతీయ పార్టీ బిజెపిలోకి వెళ్ళిపోవాలా ? అన్నదే ఇపుడు దగ్గుబాటి ముందున్న పెద్ద సమస్య.  మొన్నటి ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి దగ్గుబాటి పరిస్ధితి ఇరకాటంలో పడిపోయింది.

 

రాష్ట్రవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గాలి బలంగా వీచినా ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజకవర్గంలో మాత్రం దగ్గుబాటి గెలవలేకపోయారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా నరేంద్రమోడి ప్రభావం బలంగా ఉన్నా విశాఖపట్నం పార్లమెంటు స్ధానానికి బిజెపి తరపున పోటిచేసిన ఆయన భార్య, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఓడిపోయారు.

 

సరే ఇద్దరూ ఓడిపోయారు కాబట్టి కుటుంబపరంగా బ్యాలెన్స్ అయిపోయింది. అయితే పార్టీల పరంగానే సమస్యలు మొదలయ్యాయి. భార్యేమో బిజెపి నేతగా జగన్ పరిపాలనపై ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు.  సీనియర్ నేత దగ్గుబాటి భార్య కావటంతో పురంధేశ్వరి ఆరోపణలకు, విమర్శలకు తిరిగి అంతే స్ధాయిలో ఘాటుగా రిప్లై ఇవ్వలేక చాలామంది నేతలు ఇబ్బందులు పడుతున్నారు. పోనీ దగ్గుబాటైనా ధీటైన సమాధానం చెబుతున్నారా  అంటే అదీ లేదు.

 

ఇక్కడే సమస్యపై జగన్ స్పందించారు. ప్రత్యర్ధి పార్టీలన్నాక విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చాలా సహజం. కానీ భార్యా, భర్తలిద్దరూ చెరోపార్టీలో ఉండటంతో వైసిపి బాగా ఇబ్బంది పడుతోంది. అందుకనే పార్టీలో ఉండాలో లేదో తేల్చుకునే విషయంలో దగ్గుబాటికే ఛాన్సు ఇచ్చేశారు. దగ్గుబాటి పార్టీలోనే ఉండేట్లయితే  పురంధేశ్వరిని కూడా వైసిపిలోకి తీసుకురావాలన్నది కండీషన్.

 

ఒకవేళ పురంధేశ్వరిని పార్టీలోకి తేలేకపోతే దగ్గుబాటే వైసిపిని వదిలేసే విషయంలో నిర్ణయం తీసుకోవాలని జగన్ చెప్పకనే చెప్పినట్లు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పేశారు. అంటే తన ప్రమేయం లేకుండానే దగ్గుబాటి వైసిపి-బిజెపిల మధ్య ఇరుక్కుపోయారన్నమాట. మరి ఏం చేస్తారో చూద్దాం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: