పార్టీ లోక్ సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి తన వాక్చాతుర్యంతో ప్రశంసలు పొందారు. కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడ సమక్షంలో కన్నడంలో అనర్గళంగా మాట్లాడి శభాష్ అన్పించుకున్నారు.  కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో నిర్మించిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీపెట్)ను గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సదానంద గౌడ సంయుక్తంగా ప్రారంభించారు.  అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడిన సదానంద గౌడ  ఏపీలో నైపుణ్యాభివృద్ధి కోసం పలు కేంద్ర పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఏపీ పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉదారంగా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు.


  కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ మాట్లాడిన తర్వాత ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రసంగించారు. తన ప్రసంగంలో దాదాపు సగభాగం కన్నడంలోనే ఆయన మాట్లాడారు.  జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే రాష్ట్రంలో అభివృద్ధి మొదలైందన్న ఆయన..  రాష్ట్రంలో ఇది వరకు ఏ ఒక్క సీజన్ లో కూడా కురవని భారీ వర్షాలు ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్నాయని, మరో మూడేళ్ల పాటు రైతులకు నీటి కొరత అనేదే ఉండదన్నారు. 


 శ్రీశైలం, పులిచింతల, నాగార్జున సాగర్ వంటి భారీ నీటి పారుదల ప్రాజెక్టులే కాకుండా, సోమశిల, మైలవరం, గండికోట వంటి చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులన్నీ వరద నీటితో పొంగి పొర్లుతున్నాయని పేర్కొన్నారు. అటు  రాష్ట్రాభివృద్ధి కోసం అన్ని విధాలుగా ఆదుకోవాలని బాలశౌరి  సదానంద గౌడని కోరారు. 


  బాలశౌరి ప్రసంగిస్తున్నంతసేపు సదానందగౌడ ఆసక్తిగా విన్నారు. శౌరి ప్రసంగం ముగిసిన తర్వాత ఆయన్ను బాగా మాట్లాడావంటూ సదానందగౌడ ప్రశంసించారు. కాగా ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీలో అభివృద్ధి పనుల గురించి సీఎం జగన్ సదానంద గౌడకు వివరించారు. అటు కృష్ణా జిల్లాలో సెంట్రల్ ఇనిస్ట్యూట్ రావడం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాల్లో శిక్షణకు అనువుగా ఉంటుందని జగన్ తెలిపారు. కాగా ఏపీకి ఇచ్చిన హామీల అమలుపై తాను కూడా ప్రధానికి నివేదిక అందిస్తానని సదానంద గౌడ జగన్ కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: