ఎన్నికలు వస్తున్నాయంటే మొదట హడావిడి మొదలయ్యేది ఎగ్జిట్ పోల్స్ దగ్గర నుంచే. రెండు దశాబ్దాల క్రితం వరకూ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఓ అంచనా మాత్రమే ఉండేది. దశాబ్దం క్రితం వరకూ ఎగ్జిట్ పోల్స్ ఓ పద్ధతిలో జరిగేవి. ఇప్పుడు మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఓ వ్యాపారం అయిపోయిందని విమర్శలు వస్తున్నాయి. విమర్శలకు తగ్గట్టే వారు చెప్పే జ్యోతిష్యాలు వారికే తలవంపులు తెస్తున్నాయి.

 


ఎగ్జిట్ పోల్స్ చెప్పే అంకెలకు ఫలితాల అనంతరం వచ్చే అంకెలకు పొంతన లేదనడానికి నిదర్శనం గత తెలంగాణ, ఏపీ ఎన్నికలే. ఈ రెండు ఎన్నికలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ కు పేరు గాంచిన ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి సర్వే ఎంత దారుణ పరాభవాన్ని మూటగట్టుకుందో చూశాం. మళ్లీ సర్వే చేయను అని ప్రెస్ నోట్ రిలీజ్ చేసేంతగా వారి అంచనాలు తారుమారయ్యాయి. ఇప్పుడు మహారాష్ట్ర, హర్యాణా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల నాడి పట్టడంలో ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా విఫలమయ్యాయని తేలిపోయింది. హర్యానాలో 90కి 70 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంటుందని టైమ్స్ నౌ, సీఎన్ఎన్ వంటి చాలా సంస్థలు చెప్పుకొచ్చాయి. కానీ బీజేపీ 40 స్థానాల వద్దే ఆగిపోయింది. మహారాష్ట్రలో 288కి 230 బీజేపీ-శివసేన కూటమి సాధిస్తుందని టైమ్స్ నౌ, ఏబీసీ, ఇండియా టుడే వంటి అనేక పేరు మోసిన సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి. కానీ వాస్తవంలో ఆ సంఖ్య 161 దగ్గరే ఆగిపోయింది.

 


ఇదంతా చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే సంస్థలు ఏ ప్రామాణికంతో సర్వే చేస్తున్నాయనే అనుమానం రాకపోదు. రాజకీయ పార్టీలకు అనుబంధంగా సర్వేలు చేస్తూ ఎగ్జిట్ పోల్స్ పై ఉన్న నమ్మకాన్ని చెడగొడుతున్నారు. నిజంగా ప్రజల్లో తిరిగి సర్వే చేసే సంస్థలు లేవనడానికి హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలే నిదర్శనం.


మరింత సమాచారం తెలుసుకోండి: