ఇక ఆర్టీసీ చరిత్ర ముగిసిపోయిందన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటన కార్మికుల్లో కలవరం కలిగిస్తోంది. ఇక జగమొండి కేసీఆర్ పై పోరాటంతో సాధించేది ఏమీ లేదని కొందరు కార్మికులు భావిస్తున్నారు. ఇంకా సమ్మె కొనసాగిస్తే.. ఉన్న ఉపాధి పోతుందన్న భయం వారిని వెంటాడుతోంది. అందుకే ఇక ఆలస్యం చేయకుండా విధులకు హాజరుకావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.


తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు కొన్ని డిపోల్లో ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరబోతున్నట్టు సమాచారం వస్తోంది. రాణిగంజ్, నాగర్ కర్నూల్, జనగాం వంటి డిపోల్లో విధుల్లో చేరేందుకు కార్మికులు రెడీ అవున్నట్టు తెలుస్తోంది. విధులకు హాజరైన వారికి వెంటనే సెప్టెంబర్ జీతం ఇచ్చే ఏర్పాటు కూడా యాజమాన్యం చేయబోతోందట.


యూనియన్ల నేతలు చెప్పే మాటలు వినకుండా కార్మికులు స్వచ్చందంగా విధుల్లో చేరాలని ఇప్పటికే.. ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. బేకారుగాళ్లు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. మూడు రోజులు చూస్తామని, ఆ తర్వాత ఏడువేల బస్ లకు పర్మిట్లు ఇస్తామని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడవలసిన బాద్యత ప్రభుత్వంపై ఉంటుందని ఆయన అన్నారు.


కార్మిక నేతలు ఏమి మాట్లాడుతున్నారో చూస్తున్నారు కదా.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న కార్మిక నేతలతో తాను ఎలా చర్చలు జరుపుతానని కేసీఆర్ అన్నారు. కార్మికులే వారి భవిష్యత్తును తేల్చుకోవాలని కేసీఆర్ సూచించారు. దీన్ని బట్టి చూస్తే ఇక కార్మికులతో చర్చలు ఉండవు.. అన్నా అవి ఫలవంతం కావు అని క్లియర్ గా తేలిపోతోంది. అందుకే ఉన్న ఉద్యోగం పోగొట్టుకోవడం ఎందుకన్న ఆలోచనలో కొందరు కార్మికులు ఉన్నట్తు తెలుస్తోంది.


ఆర్టీసీ ముగిసిపోయిందన్న కేసీఆర్ ప్రకటన తర్వాత తెలంగాణ ఆర్టీసీ కార్మికుల్లో విపరీతమైన చర్చ జరిగింది. కార్మికులు ఒకరికొరు ఫోన్లు చేసుకుని భవిష్యత్ ఏం కాబోతుందన్న ఆందోళనతో చర్చించుకున్నారు. ఇంకా కేసీఆర్ తో పెట్టుకుంటే లాభం లేదన్న ఆలోచనకు కొందరు కార్మికులు వచ్చినట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: