హైదరాబాద్ మెట్రో ప్రతిరోజు లక్షల సంఖ్యలో నగరవాసులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. ప్రస్తుతం ఎల్బీనగర్ నుండి మియాపూర్ వరకు నాగోల్ నుండి హైటెక్ సిటీ వరకు రాకపోకలు సాగిస్తున్న మెట్రోలో మరో కొత్త రూట్ రెడీ అయింది. గత 20 రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతూ ఉండటంతో లక్షల సంఖ్యలో ప్రయాణికులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. 
 
ఇప్పటికే తొలి దశలోని మూడు కారిడార్లలో రెండు కారిడార్లు ప్రారంభం అయ్యాయి. కారిడార్ 2 మాత్రం ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. అధికారులు కారిడార్ 2లో 15 కిలోమీటర్ల మార్గాన్ని అందుబాటులోకి తీసుకొనిరావాల్సి ఉండగా ప్రస్తుతం 10 కిలోమీటర్ల మార్గాన్ని అందుబాటులోకి తీసుకొనిరావటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికారులు ఇప్పటికే ఈ మెట్రో స్టేషన్లలో టికెట్ మిషన్లు, అక్సిలరీ పవర్ సర్వీస్ స్టేషన్లు, విద్యుత్ లైన్, ట్రాక్ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 
 
విద్యుత్ తనిఖీలు కూడా అధికారులు ఇప్పటికే పూర్తి చేశారని సమాచారం. అధికారులు ట్రయల్ రన్ పూర్తి చేస్తే జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు మెట్రో రైళ్ల సేవలు ప్రారంభం అవుతాయి. నవంబర్ నెలలో ఈ మార్గంలో మెట్రో రైళ్ల సేవలు అందుబాటులోకి రాబోతున్నాయని తెలుస్తోంది. కారిడార్ 2 లో భాగమైన ఎంజీబీఎస్ ఫలక్ నామా మధ్య మాత్రం పనులు కొనసాగుతున్నాయి. 
 
జూబ్లీ బస్ స్టేషన్ నుండి పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్, మహాత్మాగాంధీ బస్ స్టేషన్ వరకు మెట్రో సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ఈ రూట్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగరవాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో సోమవారం రోజు 4 లక్షల మంది హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రయాణించారు. ఒక్కరోజే 4 లక్షల మంది ప్రయాణం చేయటంతో హైదరాబాద్ మెట్రో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. మెట్రో ప్రారంభం అయిన రోజు నుండి ఇదే అత్యధికమని మెట్రో రైలు ఎండీ వెల్లడించారు. 



 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: