ఏపీలో ఇసుక తుఫాన్‌ కొనసాగుతోంది. ఇసుక కొరతకు సర్కారే కారణం అంటూ విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. మరోవైపు తమ కష్టాలు గట్టెక్కించాలంటూ కలిసిన భవన నిర్మాణ కార్మికులకు జనసేన మద్దతు తెలిపింది. వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్. 


ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత ప్రభావం భవన నిర్మాణ కార్మికులపైనే కాకుండా మొత్తం సమాజంపై పడిందని జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ అన్నారు. ఇసుక కొరత సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు జనసేనాని. ఏపీ నలుమూలల నుంచి  తరలివచ్చిన ఇసుక లారీల యజమానులు, డ్రైవర్లు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్‌ తో భేటీ అయ్యారు. ఇసుక లేకపోవటంతో  తాము పడుతున్న కష్టాలను వారు పవన్ ముందుంచారు. 


రాష్ట్రంలో ఇసుక కొరత సమస్యతో లక్షలాది మంది కార్మికులు పనుల్లేక బాధపడుతున్నారని పవన్‌ కల్యాణ్‌ ఆవేదన  వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలి గానీ ఉన్న ఉద్యోగాలను తీసేయకూడదని అన్నారు జనసేన అధినేత. అసలు  అమరావతిలో రాజధాని కడతారా? లేదా? స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇసుక సరఫరా పునరుద్ధరణ జరిగే వరకు పోరాటం  చేస్తామన్నారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకొనేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు జనసేనాని. 


ఇసుక సంక్షోభంతో 30లక్షల మంది రోడ్డున పడ్డారని తెలిపారు పవన్ కల్యాణ్. ఇసుక సరఫరాపై ఇప్పటికీ స్పష్టత లేదని  వ్యాఖ్యానించారు. ఇసుక విధానంపై టీడీపీ తప్పులు సరిదిద్దే క్రమంలో కొత్త సమస్యను సృష్టించారని అన్నారు. 6 వేల ఇసుక లారీలు  కొత్తగా ఇస్తామని చెబుతున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ లారీలకు జీఎస్టీ తగ్గించాలని ఏకంగా 486 జీవోను తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇలా జీవో తీసుకురావడం సరికాదని వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు పవన్‌ కల్యాణ్.


మొత్తానికి...అటు టీడీపీ ఆందోళనలు...ఇటు పవన్ కల్యాణ్ తో లారీ యజమానుల భేటీలు కావటంతో రాష్ట్రంలో ఇసుక  రాజకీయం మరింత వేడెక్కినట్లయింది. ఐతే...దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేదే ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: