ఐ టీ ఐ అభ్యర్థులకు అప్రెంటిస్ షిప్ అవకాశాలు కల్పించే విషయంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిబంధనలు పాటించనందు వల్ల తెలంగాణ యువత కు తీరని అన్యాయం జరుగుతోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు ఆయన లేఖ రాశారు. ఐ టీ ఐ పూర్తి చేసిన అభ్యర్థులకు అప్రెంటిస్ షిప్ అవకాశాలు కల్పించే విషయం లో స్థానిక ఎంప్లాయిమెంట్ ఎక్స్ చేంజ్ లో పేరు నమోదు చేసుకున్న వారికే అన్న నిబంధనలు కచ్చితంగా అమలు చేసేలా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కు ఆదేశించాలని వినోద్ కుమార్ రైల్వే మంత్రి ని కోరారు.


స్థానిక ఎంప్లాయిమెంట్ ఎక్స్ చేంజ్ లో పేరు నమోదు చేసుకున్న వారికే రైల్వే అప్రెంటిస్ షిప్ లో అవకాశం ఇవ్వాలని నిబంధనలు ఉన్నా దాన్ని అమలు చేయడం లేదని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ కారణంగా ఉత్తరాది రాష్ట్రాలు ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అప్రెంటిస్ షిప్ లో పెద్ద ఎత్తున చేరుతున్నారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో ఎస్ సి ఆర్ పరిధిలోని తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల ఐ టీ ఐ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని వినోద్ కుమార్ వివరించారు. అప్రెంటిస్ షిప్ చేసిన వారికి రైల్వే గ్రూప్ డీ ఉద్యోగ నియామకాలలో 20 శాతం రిజర్వేషన్ అవకాశాన్ని తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కోల్పోతున్నారని ఆయన అన్నారు.


రైల్వే లోని అప్రెంటిస్ షిప్ చట్టం1961 ను రూపొందించి, 2014 లో సవరించారని , ఈ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. కేంద్ర రైల్వే శాఖ, రైల్వే బోర్డు జారీ చేసిన ఉత్తర్వులు నంబర్ E ( MPPP ) 2001/6/7, Date 22.2.2002 ను కచ్చితంగా అమలు చేయాలని, ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం కు ఆదేశించాలని వినోద్ కుమార్ కోరారు. కేంద్ర రైల్వే మంత్రి తో పాటు రైల్వే బోర్డు చైర్మన్, ఎస్ సీ ఆర్ జీఎం లకు కూడా లేఖలు రాశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: