టిడిపి నుండి బీజేపీలో చేరిన ఎంపీ సుజనా చౌదరి టిడిపిని టార్గెట్ చేస్తున్నారనే  విషయం టీడీపీ నేతల్లో బలంగా ఉంది. టిడిపి నేతలను బిజెపి లో చేర్చుకోవడానికి సుజనా చౌదరి పావులు కదుపుతున్నారా అన్న అనుమానాలు నిజమయ్యేలా ఉన్నాయి.
ఎందుకంటె కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత సుజనా చౌదరితో కరణం బలరాం, ఆయన కుమారుడు కరణం వెంకటేష్ సమావేశం అయ్యారు.   

టీడీపీ నుంచి కమలం పార్టీలోకి వలసలు కొనసాగుతున్న తరుణంలో బీజేపీ ఎంపీని కలవడం ఆసక్తి రేపుతోంది. నాలుగు రోజుల క్రితమే మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కాషాయ కండువా కప్పుకున్నారు. ఒంగోలులో వీఐపీ రోడ్డులో ఉన్న ఒక నివాసంలో ఓ గదిలో సుజనా, కరణం ఇద్దరూ రహస్య మంతనాలు జరిపినట్టు తెలిసింది.ఈ సందర్భంగా మాట్లాడిన సుజనా చౌదరి.. టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీతోపాటు చాలా మంది నేతలు బీజేపీ మీద సానుకూలంతో ఉన్నారని చెప్పారు.

ఏపీలో బీజేపీని బలోపేతం చేసి రాజ్యాధికారం సాధించే దిశగా పయనిస్తోందని, ఆ బాధ్యతను తనకు అప్పగించిందని సుజనా చౌదరి చెప్పారు.తెలుగుదేశం పార్టీకి చెందిన వారితో పాటు ఇతర పార్టీల నేతలు కూడా తమతో టచ్‌లో ఉన్నారని సుజనా చౌదరి చెప్పారు. అయితే, ఎంతమంది బీజేపీలో చేరతారనే అంశం మీరే చూస్తారంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు లేదని, భవిష్యత్తు బీజేపీదేనన్నారు.


2019 ఏప్రిల్‌లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన కరణం బలరాం, వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణ మోహన్ మీద విజయం సాధించారు. అయితే, తాను ఎమ్మెల్యే అయినప్పటికీ.. అధికార పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్ హవానే ఎక్కువగా నడుస్తుందనే అభిప్రాయం కరణం బలరాంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వైసీపీలో చేరడం కంటే.. బీజేపీలో చేరితే ఫ్యూచర్ బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన చర్చలకు దిగినట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: