తెలంగాణలో ఎన్నడు లేనంతగా ప్రయాణికులకు రోజు రోజుకు ఇబ్బందులు రవాణా విషయంలో ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె 24వ రోజుకు చేరుకోగా, ఇంకా ఎన్ని రోజులకు సమ్మె ముగుస్తుందో తెలియడం లేదు. ఇప్పుడున్న పరిస్దితిలో తెలంగాణ ఆర్టీసీ భవిష్యత్తు ఒకరకంగా ప్రశ్నార్ధకంగా మారిందంటున్నారు కొందరు. ఇకపోతే ఈ సమ్మెపై మొదటి నుంచి  సీఎం కేసీఆర్ సీరియస్‌గా ఉన్నారన్న విషయం తెలిసిందే.  సమ్మె మొదలునుంచి కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని చెబుతూ వచ్చారు.


అయినా శనివారం కార్మికులతో ఆర్టీసీ యాజమాన్యం చర్చలు జరిపింది. ఈ చర్చలతో సమస్య పరిష్కారమవుతుందని చాలామంది భావించారు. కానీ హైకోర్టు ఆదేశాలకు లోబడి పలు డిమాండ్లపై మాత్రమే చర్చలు జరుపుతున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఇక కార్మికులు ప్రధానంగా చేస్తున్న డిమాండ్, ప్రభుత్వంలో సంస్థ విలీనం. ఈ అంశంపై చర్చకు అంగీకరించేది లేదని మొదట్లోనే స్పష్టం చేసింది యాజమాన్యం. ఇదిలా ఉంటే ఆర్టీసీ విషయంలో సీఎం కేసీఆర్ చెప్పిందే చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్టీసీ సమ్మెకు ముగింపు ఆర్టీసీ ముగింపే అని వ్యాఖ్యానించిన కేసీఆర్... త్వరలోనే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి అద్దె బస్సులపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు ప్రకటించారు.


ఆర్టీసీ కార్మికులతో చర్చలు విఫలం కావడంతో ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకునేందుకు మార్గం సుగమమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కోర్టులో విచారణ సందర్భంగా తమ నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు ప్రభుత్వానికి ఓ అవకాశం దక్కిందనే వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఆర్టీసీ సమ్మె విషయంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న సీఎం కేసీఆర్... తాను చెప్పిందే చేయడానికి సిద్ధమవుతున్నట్టు పలువురు చర్చించుకుంటున్నారు. ఈ దశలోనే  ఆర్టీసీ అద్దె బస్సులు పెంపు కోసం మరిన్ని నోటిఫికేషన్లు జారీచేయాలని అధికారులకు స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.


ఒకవైపు ప్రత్యామ్నాయ చర్యలు మరింత వేగవంతం చేస్తూనే, ప్రైవేట్ రూట్లపై సర్వే నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రైవేటు రూట్లు, బస్సుల విధి విధానాలపై కసరత్తు చేయాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలు చూస్తుంటే ఆర్టీసీ కార్మిక సంఘాలతో రాజీ పడేది లేదని అర్థమవుతోంది. జేఏసీ నేతలు చర్చల మధ్యలోనే వెళ్లిపోయారని అధికారులు ఇచ్చిన నివేదికతో కేసీఆర్ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. చూద్దాం ఆర్టీసీ సమ్మె చివరికి ఏ తీరం చేరుతుందో అంటూ కొందరు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారట..


మరింత సమాచారం తెలుసుకోండి: