తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెను విఫలం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్న సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. హైకోర్టు చర్చలు జరపమని చెప్పిన నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చలను బహిష్కరించి వెళ్లిపోయారని కోర్టుకు ఆర్టీసీ యాజమాన్యం నివేదిక ఇవ్వబోతోంది. ఇదే సమయంలో కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టెంపరరీ కండక్టర్లు, డ్రైవర్లను నియమించుకుంటూనే... ఆర్టీసీలో అద్దె బస్సులను పెంచేందుకు మరిన్ని నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.


అంతే కాకుండా ప్రైవేట్ రూట్లపై యుద్ధప్రాతిపదికన సర్వే నిర్వహించి రూట్లు, విధి విధానాలను ఖరారు చేయాలని కేసీఆర్ రవాణా మంత్రి, అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. మరోవైపు కార్మికులు కూడా సమ్మెను మరింత ఉధృతం చేయబోతున్నారు. ఇందులో భాగంగా సోమవారం కలెక్టరేట్ల ముట్టడికి ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ కలెక్టరేట్ల ముట్టడికి రాజకీయ పార్టీలు కూడా మద్దతిస్తున్నాయి.


తెలంగాణ ఆర్టీసీ కార్మికుల కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ శ్రేణులకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి పిలుపు ఇచ్చారు. అంతే కాకుండా ఈనెల 30న నిర్వహించ తలపెట్టిన సకలజనుల సమరభేరి సభ కోసం కార్మికులు సన్నద్ధమవుతున్నారు. చర్చలకు ఎప్పుడు పిలిచినా రావడానికి మేం సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు.


ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యానికి శనివారం నాడు జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. ఈరోజు కోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉండటంతో ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆదివారం మరోసారి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్‌, ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఎండీ సునీల్‌శర్మ, ఈడీలు హాజరయ్యారు. సమావేశంలో కోర్టుకు ఇవ్వాల్సిన నివేదికపై నిశితంగా చర్చించారు. చర్చలు విఫలంకావడంతో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. మొత్తం మీద ఈ రెండు, మూడు రోజులు ఆర్టీసీ సమ్మెకు కీలకం కాబోతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: