ఆర్టీసీ సమ్మె కారణంగా సామాన్యుడి చితికిపోతున్నారు. ప్రత్యేకించి చిరుద్యోగుల జేబులకు చిల్లులు పడుతోంది. హైదరాబాద్ నగరంలో రూ.15 వేల లోపు నెల జీతం సంపాదించే ఎందరికో ఆర్టీసీ సమ్మె శాపంగా మారింది. హైకోర్టు తీర్పుతోనైనా సమ్మె కొలిక్కి వస్తుందేమోనని వారు ఆశలు పెట్టుకున్నారు.


పది వేల లోపు సంపాదించే ఎందరో హైదరాబాద్ లో ఆర్టీసీనే నమ్ముకున్నారు. రూ.880తో మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్ తీసుకుని.. రోజూ కార్యాలయానికి వస్తున్నారు. ఇప్పుడు ఆర్టీసీ సమ్మెతో వారి బడ్జెట్ తల్లకిందులయింది. కేవలం ప్రయాణానికే రోజుకు దాదాపు 150 వరకూ ఖర్చు చేయాల్సివస్తోంది. సాధారణంగా చిరుద్యోగులు నగర శివార్లలో నివసిస్తుంటారు. వారు సిటీ కి రావాలంటే ఇప్పుడు.. వారు ఉండే ప్రదేశం నుంచి మెట్రో ను ఆశ్రయిస్తున్నారు. ఆ తర్వాత షేర్ ఆటోలు ఎక్కుతున్నారు.


ఇలా ఇరువైపులా ఆటో ఛార్జీలతో పాటు.. మెట్రో ప్రయాణ ఖర్చు కలిసి నెలకు 4000 వరకూ ఖర్చవుతోంది. అంటే జీతంల దాదాపు సగభాగం వరకూ ప్రయాణ ఖర్చులకే వెచ్చించాల్సి వస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నగరంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే 33 లక్షల మంది ప్రయాణ ఖర్చులను పెంచే సింది. ప్రయాణ ఖర్చులు పెరగడంతో ప్రైవేటు కంపెనీల్లో గైర్హాజరయ్యేవారి సంఖ్య పెరుగుతోందని యజమానులు వాపోతున్నారు.


ఈ నేపథ్యంలో సామాన్యుడు హైకోర్టు తీర్పుపైనే ఆశలు పెట్టుకున్నాడు. కోర్టులో ఆర్టీసీ సమ్మె పై విచారణ ఉందంటే.. ఆర్టీసీ కార్మికులే కాదు.. బస్సు ప్రయాణికులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. యాభై.. అరవై ఏళ్ల ఆర్టీసీ వ్యవస్థ స్తంభిస్తే.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కేవలం రోజుల్లో సాధారణ పరిస్థితిని తీసుకురావడం సాధ్యమయ్యే పని కాదు. అయినా పాలకులకు పట్టడం లేదంటూ సామాన్యుడు వాపోతున్నాడు. ఈ పరిస్థితుల్లో హైకోర్టు తీర్పు పైనే సాధారణ జనం ఆశలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: