జగన్ సర్కార్ 2430 పేరిట తెచ్చిన ఒక జీవో మీద ఇపుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఆ జీవో పత్రికా స్వేచ్చకు భంగం అంటున్నారు కొందరు. అసలు పత్రికా స్వేచ్చ అంటే ఏంటి. దాని గురించి తెలుసుకుంటే జీవో తప్పో ఒప్పో చర్చించవచ్చు. భావప్రకటన స్వేచ్చ పౌరులందరికీ ఉంది. అందులో  భాగంగానే పత్రికా స్వేచ్చ కూడా ఉంది. అంతకు మించి పత్రికలకు పెద్దగా వేరే విధంగా స్వేచ్చ అంటూ లేదు.


మరి అటువంటి సమయంలో పత్రికా స్వేచ్చ అంటూ కొందరు కాని పనులు చేస్తూ ఉంటే చూస్తూ వూరుకోవాలా అన్నది మరో చర్చ.  నిజానికి పాత్రికేయులు వేరు, పత్రికలకు పెట్టుబడి పెట్టి నడిపే యజమానులు వేరు. యజమానులు ఎపుడూ పాత్రికేయులు కారు. ఆ ముసుగులో ఎవరైనా తమను తాము కాచుకోవడానికి ప్రయత్నాలు చేస్తే అది అసలైన పత్రికా స్వేచ్చకు విఘాతంగా చెప్పాలి. కొందమంది పత్రికల యజమానులు బాహాటంగా ఫలానా పార్టీతో తమకు విరోధం ఉందని చెప్పుకుంటున్నారు. రాతలు రాస్తున్నారు. తమ పత్రికలతో పనిచేసే వారి చేత రాయిస్తున్నారు. దాని వల్ల  పాత్రికేయులు గ్రామ స్థాయిలో వర్గ పోరాటాలకు, రాజకీయాలకు బలి అవుతున్నాయి. ఓ విధంగా కొన్ని పత్రికలు హిడెన్ అజెండా పెట్టుకుని తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు పని చేస్తున్నాయి. ఆయా పత్రికల్లో వారు వ్యతిరేకించే నాయకులు, పార్టీలకు సంబంధించిన వార్తలు మచ్చుకైనా రావు.


ఒక పత్రికాధిపతి ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడిని కలుస్తాడు. అక్కడ ఏకాంత  చర్చలు జరిపానంటూ తన మీడియాలోనే గట్టిగా రాసుకుంటాడు. మరి ఇలాంటి పత్రికలను ప్రజలు నమ్ముతున్నారా, వారి రాజకీయానికి పత్రికా స్వేచ్చకు సంబంధం ఏంటి. ఒక పార్టీని ఏపీలో అధికారంలోకి తీసుకురావాలని 2019 ఎన్నికల్లో కొన్ని పత్రికలు, చానళ్ళు గట్టిగా క్రుషి చేసిన సంగతి ఏపీలోని అయిదు కోట్ల మంది ప్రజలకు తెలిసిన సంగతే. ఇలా ప్రాంతీయ రాజకీయాలు, ప్రాంతీయ పత్రికలు, సామాజిక వర్గాలు కలగలసిపోయి రాజకీయాన్ని కంపు కొట్టిస్తున్న వేళ, న్యూస్ కంటే వ్యూస్ నే రాస్తూ తమ మెదళ్ళలో వూహించిన వాటినే జనం మెదళ్ళల్లో జొప్పించాలని చూస్తున్న పత్రికల విషయంలో పత్రికా స్వేచ్చ అన్న మాటకు అర్ధమే లేదు. వారు బస్తీ మే సవాల్ అంటూ పాలకులకే సవాల్ చేస్తున్న నేపధ్యంలో ఇక వారిని ఈ జీవోలు ఏం చేస్తాయి అన్న మాట కూడా వినిపిస్తోంది.


ఏది ఏమైనా ఎవరైనా. వాస్తవాలు రాయాలి.   పత్రికల లక్ష్యం అంతిమంగా ప్రజలు కావాలి. కానీ పత్రికల ముసుగులో సొంత ఆస్తులు పెంచుకుని, కులం, వర్గం, ప్రాంతం చట్రం నుంచి బయటకు రాని వాళ్ళు ఏరి కోరి ఇలాంటి జీవోను తామే తెచ్చుకున్నారనే చెప్పాలి. ఈ విషయంలో పోరాటాలు చేయడం కంటే తమను తాము మార్చుకుని ఇప్పటికైనా నిజాలు రాయడం నేర్చుకుంటే పత్రికారంగం ఆరోగ్యకరమైన వాతావరణంలో సాగుతోంది. అయినా ఆ జీవోలో ఏముందని. వాస్తవాలు రాసే వారికి, ఆధారాలు ఉన్న వారికి ఎలాంటి బెంగ కూడా లేదుగా. మరి జగన్ జారీ చేసిన జీవో మీద పోరాటం అంటే తాము నిజాలు రాయం, రాయలేమని ఒప్పుకోమడమేగా. ఇదే మరి అసలైన‌ దివాళాకోరు తనమంటే.



మరింత సమాచారం తెలుసుకోండి: