ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు వ్యవహారంలో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ నాంపల్లి సీబీఐ కోర్టులో  దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. సీఎం జగన్ రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వర్తిస్తున్నందున కోర్టుకు హాజరు కాలేనంటూ పిటిషన్ దాఖలు చేయగా జగన్ అభ్యర్థనను తిరస్కరిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. అక్టోబర్ 18వ తేదీన సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది. 
 
సీబీఐ కోర్టు పరిస్థితులు మారాయి కానీ నేరంలో ఎలాంటి మార్పు లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన పదవి ఉన్నంత మాత్రాన హాజరు మినహాయింపు కుదరదని చట్టానికి ఎవరూ అతీతులు కారని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. సీబీఐ చాలా బలంగా కౌంటర్ ఇవ్వటంతో సీబీఐ కోర్టు ఈ తీర్పును వెలువరించిందని సమాచారం. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావటం వలన వ్యయం మరియు భద్రతపరంగా ఇబ్బందులు ఎదురవుతాయని జగన్ తరపు న్యాయవాదులు వాదించారు. 
 
కానీ సీబీఐ కోర్టు జగన్ న్యాయవాదులు చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకోలేదు. హోదా అనేది కోర్టు ముందు పనికిరాదని చట్టం ముందు అందరూ సమానులేనని కోర్టు స్పష్టం చేసింది. సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రాజగోపాల్, శ్రీలక్ష్మి, ఎంపీ విజయసాయిరెడ్డి ఈరోజు సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. 
 
గత కొద్ది రోజులుగా సీఎం జగన్ మంగళవారం, శుక్రవారం సచివాలయంలో ముఖ్య కార్యక్రమాలకు హాజరవుతున్నారు. రాజకీయ విశ్లేషకులు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరు కావటం కొంత ఇబ్బందికర పరిణామమే అని చెబుతున్నారు. సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఉన్నత న్యాయస్థానాన్ని సీఎం జగన్ ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: