ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ఆందోళన అవసరం లేదని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ మీడియా, అంతర్రాష్ట్ర వ్యవహారాలు సలహాదారు దేవులపల్లి అమర్ పేర్కొన్నారు. ఆంద్రప్రదేశ్ మీడియా సలహాదారునిగా నియామకం అయ్యాక మొదటిసారి మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌....వివాదాస్ప‌ద జీఓ గురించి స్ప‌ష్ట‌త ఇచ్చారు. ``ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఒక జీఓ విడుదల చేసింది. ప్రభుత్వంపై నిరాధారమైన వార్తలు రాసినా, ప్రచారం చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జీఓలోని విషయం. మీడియాపై ఆంక్షలు, లక్ష్మణ రేఖ ఉండాల్సిన అవసరం ఉందా అని అంశంపై గతంలోనే చర్చలు జరిగాయి.`` అని తెలిపారు.


జాతీయ మీడియా ప్రముఖులు, సంపాదకులు అనేకమందితో  2007 లో జరిగిన సదస్సు లో మీడియాకు లక్ష్మణ రేఖ ఉండాలని పేర్కొన్నారని అమ‌ర్ వెల్ల‌డించారు. ``పత్రికలకు ప్రత్యేకమైన స్వేచ్ఛ ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా పొందుపరచలేదు. కానీ ఎన్నో ఏళ్లుగా మీడియాకు స్వేచ్ఛ అనే అంశాన్ని అందరూ గౌరవిస్తూ వస్తున్నారు. కానీ గత కొంతకాలంగా రాజకీయ అండదండలతో, కొందరికే స్వలాభం కలిగేలా వార్తలు ప్రచురిస్తున్నారు. వ్యక్తికి గాని, సంస్థకు గాని, నష్టం కలిగేలా, బురదజల్లే ప్రయత్నాలు ఏ మీడియా కూడా చేయకూడదు. అలా ఎవరైనా చేస్తే..న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం కొత్త జీఓ ను తీసుకొచ్చారు.  ఎవరైనా అసత్య వార్త రాస్తే...అది నిరాధారమైన వార్త అని..ఆధారాలతో ఏ సంస్థ అయినా, ప్రభుత్వమైనా ఖండన వార్తను ఇస్తే పత్రికలు ప్రచురించాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుతం అటువంటి పరిస్థితి పత్రికల్లో, మీడియాలో లేదు. `` అని వెల్ల‌డించారు. 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ జీఓ పై కొందరు లేనిపోని రాద్దాంతం చేస్తున్నారు. కానీ ఇది కొత్తగా తీసుకున్న నిర్ణయమైతే కాదు అని అమ‌ర్ స్ప‌ష్టం చేశారు. ``ఈ జీఓ వలన అసత్యాలను, నిరాధారమైన వార్తలు రాసే వారే భయపడుతున్నట్లు ఉన్నారు. నిజాలను నిర్భయంగా రాసే జర్నలిస్టు భయపడాల్సిన అవసరం లేదు.  ఒకవేళ రాసిన వార్త నిజమైతే..కోర్టు ద్వారా న్యాయపరమైన రక్షణ పొందవచ్చు. కొన్ని దినపత్రికల్లో కలానికి సంకెళ్ళు అనే తరహాలో వచ్చిన వార్తలు, వ్యాఖ్యానాలు పూర్తిగా అసత్యం. నిజానికి పత్రికా స్వేచ్ఛ అనేది ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం..  భారత పౌరులందరికీ రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వాతంత్ర్యంలో భాగంగానే లభించింది. ఈ హక్కు మీద రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు ఎటువంటి నియంత్రణా లేదు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీన్ని ఉల్లంఘిస్తూ ఎటువంటి చట్టమూ తీసుకురాలేదు. పౌరులకు సరైన సమాచారం తెలుసుకునే హక్కు ఉంది. అంటే తప్పుడు సమాచారం, తప్పుదోవ పట్టించే సమాచారం ఇచ్చే హక్కు పత్రికలకు గానీ, మీడియాకు గానీ లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ...దురుద్దేశపూర్వకంగా, ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా వార్తలు రాస్తే కేసులు పెడతాం అన్నారు తప్ప నిజాలు రాస్తే కేసులు పెడతామని ఎక్కడా అనలేదు. మేం అబద్ధాలే రాస్తాం...ప్రభుత్వం మాత్రం ఏమీ అనటానికి వీల్లేదు.. అని కొన్ని పత్రికలు వారు వాదించటం పత్రికా స్వేచ్ఛలో భాగం అవుతుందా..? అబద్ధాలు రాయటాన్ని, దురుద్దేశపూర్వకంగా ఒక ఎజెండా పెట్టుకొని వార్తలు రాయటాన్ని పత్రికా స్వేచ్ఛలో భాగం అని ఏం న్యాయస్థానమైనా తీర్పు ఇచ్చిందా..? తప్పుడు వార్తలు రాయటాన్ని భారత రాజ్యాంగంగానీ, ఉన్నత న్యాయస్థానాలు గానీ సమర్థించాయా..?  కులపరంగా, పార్టీ పరంగా తయారైన మీడియా ఆంధ్రప్రదేశ్ లో విజృంభించి చేస్తోన్న కుట్ర పూరిత ప్రచారం కూడా పత్రికా స్వేచ్ఛలో భాగమేనా..? వ్యక్తి ప్రతిష్టకు, వ్యవస్థ ప్రతిష్టకు గానీ భంగం కలిగిస్తే.. ఫిర్యాదు చేసేందుకు, దావా వేసేందుకు ఒక వ్యక్తికి గానీ, సంస్థకు గానీ, ప్రభుత్వ విభాగానికి గానీ ఉన్న హక్కును ఆయా సందర్భాల్లో ఎవరైనా తప్పనిసరిగా ఉపయోగించుకోవటం వారి హక్కు. కచ్చితంగా అది రాజ్యాంగ బద్ధమైన హక్కు.`` అని వెల్ల‌డించారు. 


``ఇక్కడ అంతా గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ప్రభుత్వం తెచ్చిన జీవోను వ్యతిరేకిస్తున్న కొందరు మేం తప్పుడు వార్తలు రాయం.. అని మాత్రం అనకపోవడం.`` అని ఎద్దేవా చేశారు. ``తప్పుడు వార్తలు రాయనట్టు అయితే.. కేసులకు, దావాలకు వారెందుకు భయపడాలి?  నిస్పాక్షికమైన జర్నలిజాన్ని ఎవరు మాత్రం అడ్డుకోగలుగుతారు? ఏ కంప్లైంట్ చేయాలన్నా.. దావా వేయాలన్నా.. ఐపీసీ, సీఆర్ పీసీ, దావాలకు సంబంధించిన సివిల్, క్రిమినల్ డిఫమేషన్ కు సంబంధించిన ప్రొసీజర్లన్నీ పాటించాల్సిందే. ఇవన్నీ కేంద్ర చట్టంలో భాగమే తప్ప ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశాలు కాదు కదా..ఇప్పుడు తీసుకొచ్చిన జీవోలో కేవలం జరిగిన మార్పు ఏమిటంటే.. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తూ వార్తలు రాస్తున్న పత్రికలపై కేసులు పెట్టే అధికారాన్ని ఇంతకుముందు ఒక్కరికి ఉంటే.. ఇప్పుడు ఆయా శాఖాధిపతురులకు బదిలీ చేయడం మాత్రమే.... అంటే ఆ ఫిర్యాదు ఎవరు చేయాలన్న అంశం సంబంధింత శాఖలకు అప్పగించటం ద్వారా ప్రభుత్వం సరైన దిశగా నిర్ణయం తీసుకున్నది. `` అని స్ప‌ష్టం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: