భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా నవంబర్ 3వ తేదీన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ తలపెట్టిన సంగ‌తి తెలిసిందే. 3వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న లాంగ్ మార్చ్ వివ‌రాల‌ను తాజాగా జ‌న‌సేన పార్టీ ప్ర‌క‌టించింది. మద్దిలపాలెం జంక్షన్ వద్ద గల తెలుగు తల్లి విగ్రహం నుంచి ప్రారంభం అవుతుంది. ఇప్ప‌టికే ఈ మేర‌కు జ‌న‌సేన స‌న్నాహాలు ఏర్పాట్లు చేసింది. తాజాగా ఆ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.


కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం కాబట్టి ఇసుక సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తుంది అనుకొంటే నెలల తరబడి కార్మికులకు ఉపాధి లేకుండాపోయినా పట్టించుకోలేదని, వారి వెతలు అందరికీ అర్థం అయ్యేలా వచ్చే నెల 3 వ తేదీన విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ చేపట్టిన‌ట్లు...జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. ఈ లాంగ్ మార్చ్ మద్దిలపాలెం జంక్షన్ నుంచి రామాటాకీస్, ఆశిల్ మెట్టల మీదుగా ఆర్టీసీ కాంప్లెక్ సమీపంలో జీవీఎంసీ బిల్డింగ్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్దకు చేరుకుంటుంది. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ జనసైనికులు, భవన నిర్మాణ కార్మికులను ఉద్దేశించి  ప్రసంగిస్తారు. లాంగ్ మార్చ్ కోసం రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చే వాహనాలకు ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్‌లో పార్కింగ్ సదుపాయం కల్పించడం జరిగిందని జ‌న‌సేన వివ‌రించింది.


ఇదిలాఉండ‌గా, ఇప్ప‌టికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు, ముఖ్యనాయకులతో పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహణపై మాట్లాడారు. అనంత‌రం పార్టీ నేత‌లు ఏర్పాట్ల‌పై సిద్ధ‌మ‌య్యారు. ``రాష్ట్ర ప్రభుత్వం అస్తవ్యస్తమైన ఇసుక విధానం మూలంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా 35 లక్షల మంది కార్మికులు ఉపాధికి దూరమయ్యారు. భవన నిర్మాణ కార్మికులు తమ కష్టాలను వివరించారు. తెలంగాణాలో 48 వేల మంది ఆర్టీసీ కార్మికులను తొలగిస్తే అన్ని పార్టీలు ఏకమై పోరాడుతున్నాయి. ఇక్కడ లక్షల మంది నెలల తరబడి ఉపాధికి దూరమయ్యారు. అన్ని పార్టీలు కలిసి పోరాడాలని కార్మికులు చెప్పారు. `` అని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: