చింత చచ్చినా పులుపు చావలేదన్న చందంగా కృష్ణా జిల్లా టీడీపీ నేతల పరిస్తితి తయారైంది. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన, ఆయా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు మాత్రం తగ్గడం లేదు. ఓ వైపు చంద్రబాబు కాళ్ళకు బలపం కట్టుకుని పార్టీ బలోపేతానికి జిల్లాలు జిల్లాలు తిరుగుతున్నారు. కానీ మరోవైపు మాత్రం నేతలు మాత్రం తమలో తాము కొట్టుకుంటూ..చంద్రబాబు కష్టానికి తగిన ప్రతిఫలం లేకుండా చేస్తున్నారు. ఇటీవల చంద్రబాబు కృష్ణా జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.


ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్షా సమావేశాలు కూడా ఏర్పాటు చేసి...పార్టీ బలోపేతానికి సూచనలు చేశారు. కానీ ఈ సమావేశాల్లో జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య వర్గపోరు స్పష్టంగా బయటపడింది. బాబు ముందే వారు ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకున్నాడు. అయితే సమావేశాలు ముగిశాక కూడా ఈ రచ్చ తగ్గలేదు. అదే విషయాన్ని తాజాగా జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు కూడా బయటపెట్టారు. జిల్లాలో నాలుగైదు నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు ఉన్నాయని ఒప్పుకున్నారు. వాటిని అధినేత సరిచేస్తారని చెప్పారు.


అయితే ఆ గ్రూపు రాజకీయాలు ఉన్న నియోజకవర్గాల్లో ముందు వరుసలో ఉంది. విజయవాడ తూర్పుగా తెలుస్తుంది. అక్కడ ప్రస్తుతం గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ దివంగత దేవినేని నెహ్రూ వర్గం...గద్దెపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమని గద్దె అసలు పట్టించుకోవడం లేదని వారు..మొన్న బాబు ముందే చెప్పారు. ఇక విజయవాడ వెస్ట్ లో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, సీనియర్ నేత నాగుల్ మీరా వర్గాలు మధ్య అసలు పడటం లేదు. ఈ మూడువర్గాల పోరు మూలంగానే మొన్న ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది.


తర్వాత పెనమలూరులో కూడా గ్రూపు రాజకీయాలు ఉన్నట్లు తేలింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కైకలూరు నియోజకవర్గంలో కూడా వర్గపోరు ఉన్నట్లు కనబడుతుంది.  అక్కడ మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, కాపు కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ చలమలశెట్టి రామానుజయల వర్గాలు ఉన్నాయి. ఇక తిరువూరులో మాజీ మంత్రి జవహర్, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వర్గపోరులకు త్వరగా చెక్ పెట్టకపోతే రాబోయే స్థానిక సంస్థలు, పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ చావుదెబ్బ తినడం ఖాయం. 



మరింత సమాచారం తెలుసుకోండి: