క‌రీంన‌గ‌ర్‌లో ఆర్టీసీ డ్రైవర్ బాబు అంతిమయాత్రలో క‌ల‌క‌లం చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ యాత్ర స‌మ‌యంలో... కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై దాడి జ‌రిగిన‌ట్లు వ‌చ్చిన వార్త‌లు క‌ల‌క‌లం సృష్టించాయి. పోలీసులు త‌నపై చేయి చేసుకోవడంతో సీరియస్ అయ్యారు. శాంతియుతంగా బాబు అంతిమయాత్ర చేస్తుండగా..పోలీసులు శవాన్ని ఎత్తుకెళ్లడం దారుణమన్నారు. ఎంపీపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. పేద కార్మికుడు చనిపోతే పోలీసులు విధ్వంసం సృష్టించారని..లా అండ్ కాపాడాల్సిన పోలీసులు సీఎం ఆర్డర్ తోనే క్రూరంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు.ఎంపీని కాలర్ పట్టుకొని కొడుతరా అని బండి సంజయ్ సీరియస్ అయ్యారు.


అయితే, దీనికి కొన‌సాగింపుగా మ‌రిన్ని ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి,రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ ఆరా తీశారని ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ``తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది.ప్రజలు, విద్యార్థులు,ఉద్యోగులు,కార్మికులు హక్కులకోసం గొంతెత్తితే ఉక్కుపాదంతో ప్రభుత్వం అణిచివేస్తోంది.తెలంగాణ వ్యాప్తంగా పోలీసు పహారా మధ్య పాలన సాగుతోంది. ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు నిజాం నిరంకుశ పాలనను తలపిస్తోంది. ప్రభుత్వ వైఖరితో  ఆవేదనకు గురై గుండెపోటుతో కన్నుమూసిన కరీంనగర్ - 2 డిపో డ్రైవర్ నగునూరి బాబు అంతిమయాత్ర సందర్బంగా పోలీసులు వ్యవహరించిన తీరు... రజాకార్ల నిర్బంధాన్ని తలపించింది. శాంతియుతంగా సాగుతున్న అంతిమయాత్రలో పాల్గొన్న నన్ను ఒక ఎంపీ అని కూడా చూడకుండా కాలర్ పట్టి, పోలీసులు చేయి చేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. పోలీసుల దురుసుతనాన్ని ఆషామాషీగా విడ్చిపెట్టే ప్రసక్తే లేదు. రాష్ట్ర ప్రభుత్వ చెప్పుచేతల్లో కీలుబొమ్మల్లాగా వ్యవహరిస్తున్న పోలీసుల ఆకృత్యాలను దేశం ముందు పెడతాం. పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లి ప్రివిలేజ్ మోషన్ ప్రవేశ పెడతాం. కరీంనగర్‌లో పోలీసుల దమననీతిపై బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకత్వం సీరియస్ గా వ్యవహరిస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ ఫోన్ చేశారు. ఇవాళ జరిగిన పరిణామాలను వారికి వివరించాను.వారికి తెలిపిన విషయాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్తామని ఇరువురు చెప్పారు.`` అని వెల్ల‌డించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: