జీవో నెంబర్ 2430.. తాజాగా జగన్ సర్కారు తీసుకొచ్చిన జీవో ఇది. దీని పేరు చెబితే ఇప్పుడు ఎల్లో మీడియా వణికిపోతోంది. ఈ జీవో పత్రికాస్వేచ్ఛకు సంకెళ్లు వేస్తోందని ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారానికి చంద్రబాబు సైతం తోడయ్యారు. ఇలా ఈ జీవోపై రాద్ధాంతం జరుగుతుండటంతో సమాచార మంత్రి పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు.


అసలు పత్రికలను నియంత్రించే చట్టాలను రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేవని, ఈ చట్టాలు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు . రాష్ట్ర ప్రభుత్వం గత నెల 30వ తేదీన జీవో 2430 విడుదల చేసిందన్నారు. దీనిపై మీడియాకు సంకెళ్లు అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఖండించారు. ఏదైనా ఒక పత్రిక ప్రభుత్వ శాఖలో జరిగే నిర్ణయాలను వాస్తవాలకు విరుద్ధంగా ప్రసారం చేస్తే అలాంటి వాటిని నియంత్రించేందుకు ఈ జీవో విడుదల చేశామన్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు సంబంధిత అధికారి చర్యలు తీసుకోవాలని జీవోలో పేర్కొన్నామన్నారు.


వాస్తవం ఒకటైతే..అవాస్తవాలు ప్రచురితం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. కలానికి సంకెళ్లు, పత్రికా స్వేచ్ఛకు భంగం అంటూ కథనాలు ప్రచురితం చేయడం సరికాదన్నారు. ఆధారాలతో వార్తలు రాయాలని కోరుతున్నామని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా అభాసుపాలు చేసే ప్రయత్నాలు జరిగితే..ఆ వార్తలను సంబంధిత శాఖ అధికారి ఖండించవచ్చు అన్నారు. అందుకోసమే జీవో జారీ చేశామని తెలిపారు.


రిజాయిండర్‌ ప్రచురింతకపోతే కోర్టును కూడా ఆశ్రయించవచ్చు అన్నారు. నిజాలు రాసే పత్రికలు భయపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మీడియాకు సంకెళ్లు అంటూ అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు. విలేకరులను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని, మీడియా యాజమాన్యం ప్రజాస్వామ్యం కంటే తాము గొప్ప అనుకోవడం సరికాదన్నారు. ఈ జీవోపై చంద్రబాబు రాజకీయాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు చెప్పేది ఓ వర్గం మీడియాకు కమ్మగా ఉంటుందని ఎద్దేవా చేశారు. విలేకరుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: