పవన్ కళ్యాణ్ కి ఇల్లు అలకగానే పండుగలా కనిపిస్తోందేమే. విశాఖలో గాజువాక నుంచి, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నుంచి పోటీ చేసిన ఓడిపోయిన తరువాత అయిదు నెలల కాలంలో పార్టీని ఏ మాత్రం జనసేనాని పట్టించుకున్నారో సొంత పార్టీ వారికే తెలియదు. అంతవరకూ ఎందుకు, విశాఖలో కవాతు అంటున్న పవన్ కి అక్కడ పార్టీ ఎలా ఉందో తెలుసా అంటున్నారు జనసైనికులు. ఇవన్నీ ఇలా ఉంటే పవన్ రేపు లాంగ్ మార్చ్ పేరిట జగన్ సర్కార్ మీద  విశాఖలో తొలి ఆందోళనకు సిధ్ధమవుతున్నారు.


ఇపుడు సరైన సమయం చూసుకుని ఆ పార్టీకి మాజీ మంత్రి, పాడేరు నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పసుపులేటి బాలరాజు రాజీనామా చేయనున్నారు. ఆయన ఈ రోజే తన రాజీనామాను పార్టీ ప్రెసిడెంట్ పవన్ కి పంపనున్నారని అంటున్నారు. పవన్ సమరోత్సాహంతో విశాఖ వస్తూంటే ఆయనకు ఈ రాజీనామా ఎదురువెళ్ళడం నిజంగా ఇబ్బందికరమే. పార్టీలో అతి పెద్ద నాయకుడిగా ఉన్న ఈ మాజీ మంత్రి జనసేన పోకడల పట్ల కొంతకాలంగా అసంత్రుప్తిగా  ఉన్నారు.


ఆయన ఓడిపోయిన తరువాత కూడా పెద్దగా రాజకీయాల వైపు ద్రుష్టి పెట్టలేదని అంటున్నారు. ఇక విశాఖలో పార్టీ బాగోగులు, మంచీ చెడ్డా చూసే నాయకులు కూడా లేకపోవడం కూడా ఆయన పార్టీ నుంచి తప్పుకోవడానికి మరో కారణం. ఇక జనసేన పార్టీ కూడా బాలారిష్టాలతో అలాగే ఉందని భావిస్తున్న బాలరాజు తన రాజీనామాను పవన్ ఎదుటే  సంధించనున్నారు. మరో వైపు ఆయన వైసీపీలో చేరుతారని గట్టిగా వినిపిస్తోంది. స్వతహాగా కాంగ్రెస్ నాయకుడు అయిన బాలరాజు నిజాయతీపరుడిగా, మచ్చలేని గిరిజన నాయకుడిగా పెరు సంపాదించుకున్నారు. ఆయన గతంలోనే  వైసీపీలో చేరాల్సి ఉంది. ఆయన్ని అరకు ఎంపీగా పోటీ చేయమని అప్పట్లో వైసీపీ హై కమాండ్ కోరడం, ఆయన పాడేరు టికెట్ కోసం పట్టుబట్టడంతో అప్పట్లో చేరిక ఆగిపోయింది. ఇపుడు మాత్రం బాలరాజు వైసీపీలో చేరి పూర్తిగా సేవలూ అందించనున్నారు. ఆయన్ని తొలిసారి మంత్రిగా 2009 ఎన్నికల్లో వైఎస్సార్ చేశారు. వైఎస్ ఫ్యామిలీ అంటే బాలరాజుకి ఇష్టం  కూడా.



మరింత సమాచారం తెలుసుకోండి: