పోలవరం ప్రాజెక్ట్ 1940 నాటి వ్యవహారం. ఇప్పటికి 80 ఏళ్ళకు పైగా గతం ఉందన్న మాట. అంతటి చరిత్ర కలిగిన  పోలవరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే నిర్మాణపు పనులకు  అడుగు ముందుకు వేశాయన్నది నిజం. 1980లో అనూహ్యంగా ముఖ్యమంత్రి అయిన టంగుటూరి అంజయ్య పోలవరం ప్రాజెక్ట్ కోసం పునాది రాయిని పాతారు. మళ్ళీ పాతికేళ్ళు గడచిపోయాయి. మధ్యలో తెలుగుదేశం జమానాలో మామా అల్లుడూ కలిపి  15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రులుగా పనిచేశారు.


అయినా టీడీపీ ఎక్కడా పోలవరం ప్రస్తావన తేలేదు. ఇక 2004లో అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా వైఎస్సార్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన పోలవరం మీద పూర్తి ద్రుష్టి పెట్టారు. అంటే పోలవరం అనేక సార్లు పునాది రాళ్ళు పడింది కానీ ముందుకు నడిపించింది మాత్రం వైఎస్సార్ అనే చెప్పుకోవాలి.  ఆ తరువాత అయిదేళ్లకు వైఎస్సార్ దుర్మరణం పాలు కావడంతో మళ్ళీ పోలవరం అలాగే ఉండిపోయింది.


ఇక తరువాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా  ఉన్న తెలంగాణా ఉద్యమాన్ని ఎదుర్కోవడానికి టైం మొత్తం వెచ్చించారు. ఇక 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పోలవరంలో కొంత కదలిక వచ్చింది కానీ దాని నిర్మాణం కంటే అస్మదీయులకు కాంట్రాక్టులు ఇప్పించుకోవడానికే టీడీపీ సర్కార్ ప్రయత్నం చేయడంతో పోలవరం అనుకున్న స్థాయిలో అడుగులు వేయలేదు. పైగా నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచేశారు.


ఇపుడు జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్ ద్వారా భారీగా ఆదాయం మిగిల్చుతూ పోలవరాన్ని పరుగులు పెట్టించాలనుకుంటున్నారు. దానికి హై కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక పోలవరం జోరు పెరుగుతుందని భావిస్తున్నారు. 2021 నాటికి పోలవరం పూర్తి చేస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు. అంటే జగన్ సర్కార్ రెండేళ్ల పదవీ కాలం లోనే భారీ నీటి ప్రాజెక్ట్ పూర్తి అవుతుందన్న మాట.


అదే జరిగితే మొత్తం క్రెడిట్ జగన్ కే దక్కుతుంది.  నిజానికి దక్కాల్సింది కూడా వైఎస్ కుటుంబానికే. ఎందుకంటే వైఎస్సార్ తలచుకోకపోతే పోలవరం ఇప్పటికీ పునాదిరాయిగా ఉండేది. వైస్సార్  అలా చేయబట్టే విభజన టైంలో కాంగ్రెస్ సర్కార్ పోలవరాన్ని  జాతీయ ప్రాజెక్ట్ చేసింది. ఇపుడు తండ్రి మొదలెట్టిన పనులను తనయుడు జగన్ పూర్తి చేసి కొత్త రికార్డ్ స్రుష్టిస్తారన్నమాట.



మరింత సమాచారం తెలుసుకోండి: