ఇటీవ‌లి కాలంలో...షాకింగ్ ప‌రిణామాల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న హైద‌రాబాద్ మెట్రో...తాజాగా సానుకూల వార్త‌ను అందించింది. మెట్రో రైలు వేగం పెరుగనుంది. ప్రస్తుతం 35 కిలోమీటర్లు ఉన్న స్పీడ్.. 40 కిలో మీటర్లకు మారనుంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కోచ్‌లు కిక్కిరిసి పోతుండటంతో వేగం పెంచాలని నిర్ణయించారు. చాలా మంది ప్రయాణికులు మెట్రోరైలు ప్రయాణానికి అలవాటుపడుతుండటం మెట్రో ప్రయాణమే మేలని అభిప్రాయం వ్యక్తం చేస్తుండటంతో మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని మెట్రో అధికారులు అంచనాకు వచ్చారు. ఈ క్ర‌మంలో వేగంపై కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.


దాదాపు నెల‌రోజులుగా జ‌రుగుతున్న ఆర్టీసీ సమ్మెకు ముందు హైద‌రాబాద్ మెట్రో ప్రతీరోజు రెండు కారిడార్లలో కలిసి 711 ట్రిప్పులు ఆపరేట్ చేసేవారు. సమ్మె ప్రారంభం అయ్యాక 100 ట్రిప్పులు పెంచి 811 ట్రిప్పులు నడిపిస్తున్నారు. అయినప్పటికీ అంచనాకు మించిన ప్రయాణికులతో మెట్రోరైలు కిక్కిరిసిపోతున్న తీరును అధికారులు గుర్తించారు. రద్దీ సమయంలో 3 నుంచి 4 నిమిషాల ఫ్రీక్వెన్సీతో రైళ్లు నడిపిస్తుండగా, సాధారణ సమయాల్లో 6 నిమిషాలకో రైలు నడిపిస్తున్నారు. అయితే క్రమేపీ మెట్రో ప్రయాణికులు పెరుగుతుండటంతో వేగం పెంచాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ప్రస్తుతం మెట్రోరైలు గంటలకు 35 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. దీనిని గంటకు 40 కిలో మీటర్లకు పెంచాలని అధికారులు నిర్ణయించారు.


మెట్రో రైలు వేగం పెంచే నిర్ణ‌యం అమ‌ల్లో భాగంగా...అధికారులు ఇప్పటికే టెస్ట్ రన్ విజయవంతంగా నిర్వహించారు. అయితే అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.  ఇందుకోసం ఇప్ప‌టికే కమిషనర్‌ ఆఫ్‌  మెట్రో రైల్  సేఫ్టీకి ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అక్క‌డి నుంచి అనుమతులు రాగానే పూర్తి స్థాయిలో వేగాన్ని పెంచనున్నారు. ఇదిలాఉండ‌గా వేగం పెంచ‌డం ద్వారా మరిన్ని ట్రిప్పులు నడిపించాలన్నదే మెట్రోరైలు వ్యూహమని అధికారులు చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: