జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ కార్య‌క్ర‌మంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్ట జలవనరుల శాఖమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా స్పందించారు. ప‌వ‌న్‌ది లాంగ్ మార్చా.... రాంగ్ మార్చా.. అని ఆయ‌న ఎద్దేవా చేశారు. వైసీపీ రాష్ట్ర కార్యాల‌యంలో అనిల్ మీడియాతో మాట్లాడుతూ..టీడీపీకి అనుబంధ పార్టీగా జనసేన మిగిలిపోతోంద‌ని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో కోట్ల రూపాయల ఇసుక దందా జ‌రిగింద‌ని మంత్రి తెలిపారు. ``100 కోట్లు ఫైన్ వేశారంటే దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుంది. ఐదేళ్ల కరవుని తీరుస్తూ వర్షాలు, వందల టీఎంసీ నీళ్లు ప్రవాహం వ‌స్తుంటే..ప్ర‌జ‌లంతా ఆనందంలో ఉన్నారు. గ‌త 55 రోజులుగా కృష్ణా బ్యారేజ్ గేట్లు తెరిచి ఉన్నాయంటే....ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. ఇలాంటి త‌రుణంలో పవన్ కల్యాణ్ చేస్తోంది లాంగ్ మార్చా.. రాంగ్ మార్చా?`` అని ప్ర‌శ్నించారు. 


లాంగ్ మార్చ్ పేరుతో ఆందోళ‌న చేస్తున్న ప‌వ‌న్‌..అస‌లు లాజిక్ మ‌ర్చిపోయార‌ని మంత్రి అనిల్ వ్యాఖ్యానించారు. `వరదల్లో ఇసుక తీసే అవకాశం ఉండదనే కనీస సృహ ప‌వ‌న్‌కు లేదా? ఉనికి కోల్పోయే పరిస్థితుల్లో చంద్రబాబు, దత్త పుత్రుడు పవన్ చేస్తున్న ఆర్భాటం కాదా ఇది? అస‌లు ఏ ప్రభుత్వమైనా ఇసుకను దాచుకుంటుందా? ఇన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న సీఎం జగన్ ఇసుకను ఎందుకు దాచుకుంటారు?`` అని ప్రశ్న‌ల వ‌ర్షం కురిపించారు. దొందు దొందూలాగా టీడీపీ, జనసేనల ఆందోళనలు.. చంద్రబాబు పిలుపుతో పవన్ పర్యటనలు ఉన్నాయ‌న్నారు.


లాంగ్ మార్చ్‌కు జనసేన కంటే టీడీపీ కార్యకర్తలు ఎక్కువగా వెళ్తున్నారని మంత్రి అనిల్ పేర్కొన్నారు. ``కృష్ణా, గోదావరి, వంశధార ఒడ్డున లాంగ్ మార్చ్ చేయండి. రాష్ర్టంలో కోట్లమంది రైతులు సంతోషంగా ఉన్నారు. నీచమైన రాజకీయాలు చేయద్దు.. మా తప్పులు ఉంటే చెప్పండి. వయసు మందగించి, అధికారం కోల్పోయి బాధ, వ్యధతో చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. మళ్ళీ నన్నే రమ్మంటున్నారు అని చంద్రబాబు అంటుంటే రైతులు భయపడిపోతున్నారు. కొడుకును కొంగుచాటు బిడ్డలా కాపాడుకుంటూ.. దత్త పుత్రినితో లాంగ్ మార్చ్ చేయిస్తున్నారు. వైయస్ జగన్ ఎక్కడ దొరకకుండా ఉన్నాడని అక్కసుతో ఆందోళనలు చేస్తున్నారు. ఉనికి కోసం ఇంత దిగజారి రాజకీయాలు చేయాలా? గోబెల్స్ ప్రచారం కాదు చంద్రబాబు ప్రచారం అని చెప్పుకోవాలి.చంద్రబాబుతో స్నేహం చేస్తే పవన్ కల్యాణ్‌కు వచ్చే ఎన్నికల్లో కూడా కష్టమే. ఇప్పటికయినా పవన్ కళ్యాణ్ సొంత రాజకీయాలు చేసుకోవాలి.`` అని అన్నారు. అడిగినవే కాకుండా, అడగని వారికి కూడా వరాలు ఇస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని పేర్కొన్న మంత్రి ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం తప్పక పరిశీలించి ఆదుకుంటుందని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: