విశాఖపట్నంలో ఈ నెల 3న తలపెట్టిన లాంగ్ మార్చ్‌కు క‌లిసి రావాల‌ని అన్ని పార్టీల‌కు విజ్ఞ‌ప్తి చేసిన‌ప్ప‌టికీ....తెలుగుదేశం పార్టీతో పాటు ఒక‌టి రెండు పార్టీలు త‌ప్ప  ప్ర‌దాన‌ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించ‌ని సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ మార్చ్‌కు సంఘీభావం తెలిపిన వారికి...ప‌వ‌న్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లోని పార్టీ కార్యాలయంలో లాంగ్ మార్చ్‌కి అన్ని వర్గాల మద్దతు కోరుతూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తమ సమస్యపై అన్ని పక్షాలను కలుపుకొని నిరసన కార్యక్రమం చేపట్టాలని భవన నిర్మాణ కార్మికులు విన్నవించారని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలిపారు.


మంగళగిరి పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యలు తెలిపారని ప‌వ‌న్ వెల్ల‌డించారు.``భవన నిర్మాణ కార్మికులు అన్ని పార్టీలతో కలసి నిరసన చేపట్టాలని కోరడం జరిగింది. వారి కోరిక మేరకు లాంగ్ మార్చ్ కు అన్ని రాజ‌కీయ పార్టీల‌ను, వివిద‌ పక్షాలను ఆహ్వానించాం. సంఘీభావం తెలిపిన అందరికీ కృతజ్ఞతలు. లాంగ్ మార్చ్ కి  విశాఖలో ఉన్న ట్రేడ్ యూనియన్ నాయకుల అందరి సహాయ సహకారాలు కోరుతున్నాం. గతంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి సమస్య వచ్చినప్పుడు నేను ముందుకు వచ్చి మీకు అండగా నిలిచాను.  ఇది 35 లక్షల మంది పైచిలుకు భవన నిర్మాణ కార్మికుల సమస్య. వారి సమస్య ట్రేడ్ యూనియన్ నాయకులుగా మీరే ఎక్కువ అర్ధం చేసుకోగలరు. లాంగ్ మార్చ్ కి సంఘీభావం తెలిపి సమస్య తీవ్రతను ప్రభుత్వానికి తెలియపర్చేందుకు ఆలంబనగా నిలవాలని కోరుతున్నాం" అన్నారు.


 విశాఖ‌నగరంలో భవన నిర్మాణాలు, వాటి అనుబంధ వృత్తులపై ఆధారపడ్డ కార్మికుల సంఖ్య సుమారు లక్షకుపైగానే ఉంటుంది. అసంఘటిత రంగ కార్మికులు అధిక సంఖ్యలో వుండటంతో లాంగ్ మార్చ్ కోసం జనసేన విశాఖపట్టణాన్ని ఎంచుకుంది. ఇందుకు అవసరమైన జన సమీకరణ, ఇతర ఏర్పాట్లు  ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు పర్యవేక్షిస్తున్నారు. విశాఖపట్నంలో ఈ నెల 3న తలపెట్టిన లాంగ్ మార్చ్ లో 13 జిల్లాల నుంచీ జనసేన నాయకులు, కార్యకర్తలు, ఆడపడుచులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జనసేన అధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: