కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి గ‌త కొంత‌కాలంగా అనూహ్య‌మైన కామెంట్ల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో టీఆర్ఎస్ పార్టీని ఎండ‌గ‌ట్ట‌డం ద్వారా మీడియాలో నిలిచిన జ‌గ్గారెడ్డి ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడు కేసీఆర్‌పై ప్ర‌శంస‌లు కురిపించ‌డం ద్వారా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. గ‌త కొంత కాలంగా ఈ ఒర‌వ‌డిని కొన‌సాగిస్తున్న జ‌గ్గారెడ్డి...తాజాగా త‌న సొంత పార్టీ అయిన కాంగ్రెస్‌లోని ప‌రిణామాల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.  పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో తాను కూడా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు. ముఖ్య‌మంత్రి అయితే అద్భుతంగా ప‌రిపాలిస్తాన‌ని చెప్పారు.


హైద‌రాబాద్‌లో జ‌గ్గారెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఢిల్లీ నుండి వ‌స్తున్న స‌మాచారంతో...పీసీసీ అధ్య‌క్షుడి మార్పు జరుగుతుందని బాగా ప్రచారం జరుగుతోంద‌న్నారు. ఈ ప్ర‌చారంలో నిజ‌ముంటే...మునిసిపల్ ఎన్నికల తర్వాత పీసీసీ నాయ‌కుడిని మార్చాలని ఆయ‌న సూచించారు. పీసీసీ రేసులో ఉన్న కాంగ్రెస్ నేత‌లంద‌రూ సమర్థులేన‌ని జ‌గ్గారెడ్డి వివ‌రించారు. 
ఎవరికి హైకమాండ్ పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇచ్చినా అందరం కలసి పని చేయాలని జ‌గ్గారెడ్డి సూచించారు. పీసీసీ నాయ‌కుడి మార్పు ఎప్పుడు జరిగి తాను రేసులో ఉన్నానని ప్ర‌క‌టించారు. ఈ నెల 17న ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ,అహ్మద్ పటేల్,కేసి వేణుగోపాల్‌ను కలుస్తానని వెల్ల‌డించారు. 


పీసీసీ అధ్య‌క్షుడిగా త‌నకు అవకాశం ఇస్తే పార్టీ బలోపేతానికి కృషి చేస్తాన‌ని జ‌గ్గారెడ్డి ప్ర‌క‌టించారు. ప్రజల సమస్యలపై పోరాటం  చేస్తూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకరావడనికి కృషి చేస్తానని వెల్ల‌డించారు. ప్ర‌స్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చే పథకాల కంటే అద్భుత పథకాలు త‌న దగ్గర ఉన్నాయని జ‌గ్గారెడ్డి వెల్ల‌డించారు. సీఎం పదవి ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తాన‌ని తెలిపారు.  జ‌గ్గారెడ్డి కామెంట్ల‌పై ఇటు కాంగ్రెస్ నేత‌లు...అటు టీఆర్ఎస్ నేత‌లు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: