ఆర్టీసీ స‌మ్మెపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోమారు ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.వందశాతం ఏం నిర్ణయం తీసుకున్న ప్రజల మేలు కోస‌మే చేస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు అంతులేని కోరికలతో సమ్మెకు వెళ్లారని.. ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకూడదని ఇవాళ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని సీఎం తెలిపారు. ఆర్టీసీ ఎజెండాగా శనివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ ముగిసింది. తర్వాత ప్రెస్‌మీట్ లో మాట్లాడిన సీఎం...  5100 ప్రైవేటు రూట్లలో బస్సులకు పర్మిట్ ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. 


అర్ధం లేని డిమాండ్లతోనే ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సమ్మెకి వెళ్లారన్న సీఎం కేసీఆర్…దేశంలో కూడా ఎక్కడా ఈ పరిస్థితి లేదన్నారు. చట్ట వ్యతిరేకంగా సమ్మెకి వెళ్లారని.. అయినా తమకు కార్మికులఫై ఎలాంటి ద్వేషం లేదన్నారు. కార్మికులు, చిరు ఉద్యోగుల పొట్టలు కొట్టే సంస్కృతికి తమది కాదని కేసీఆర్ అన్నారు. సమ్మెను విరమించుకునేందుకు మరో గడువు ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతేకాదు మరో మూడు రోజుల్లో అక్టోబర్ 5వ తేదీ అర్ధరాత్రి లోపు విధులలో చేరి బేషరతు పత్రాలను సమర్పించాలని సూచించారు. ఆర్టీసీ కార్మికులను తమ బిడ్డలుగానే భావించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని…లేదంటే చేసేది ఏమీ లేదని తేల్చి చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసే ప్రసక్తే లేదన్నారు. దీనిపై కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. 


తెలంగాణ కోసం చావు చివరిదాక వెళ్లొచ్చానని చరిత్ర తనకుందని కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణ ప్రజలను అమితంగా ప్రేమిస్తాననన ఆయన.. అన్ని వర్గాల శ్రేయస్సుతో పని చేస్తామని చెప్పారు. ప్రతిసారి ప్రజలు మంచి మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించారని సీఎం కేసీఆర్ అన్నారు. సీఎం కెసీఆర్ ఆర్టీసీ కార్మికులను మరోసారి గడువు విధించిన నేప‌థ్యంలో....కార్మికుల స్పంద‌న‌పై ఆస‌క్తి నెల‌కొంది.



మరింత సమాచారం తెలుసుకోండి: