తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోమారు ఆర్టీసీ విష‌యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ్రామాల్లో తిరిగే రూట్లలో ఆర్టీసీకి నష్టం వస్తుందని ఉన్న నివేదిక‌ల నేప‌థ్యంలో...పల్లె వెలుగు రూట్లను ప్రైవేట్ కు అప్పగించనున్నట్లు తెలిపారు. ఆరోగ్యకరమైన పోటీకోసమే 5100 బస్సులను ప్రైవేట్ కు పర్మిట్ ఇవ్వడం జరిగిందన్నారు. 5100 బస్సులు ప్రైవేటుకు ఇచ్చిన పర్మిట్ కు సంబంధించినవి రవాణా శాఖ చూస్కుంటుందన్నారు. వీలైనంత త్వరలోనే బస్సులు పల్లెవెలుగులో పరుగులు తీస్తాయన్నారు. ఆర్టీసీకి 5వేలు, ప్రైవేట్ కు 5వేల బస్సులు ఉంటాయని..ఆర్టీసీ ఆదాయం పెంచేందుకే ఈ నిర్ణయం  తీసుకున్నామన్నారు.


అడ్డమైన యూనియన్ల నిర్ణయాల వల్ల కార్మికులు తమ భవిష్యత్ ను నాశనం చేసుకుంటున్నారని సీఎం కేసీఆర్ మండిప‌డ్డారు. ఈ యూనియన్లకు తోడు ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేసి, కార్మికుల మరణానికి కారణమయ్యారని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. 4 సంవత్సరాల్లో కార్మికులకు 67 శాతం జీతాలు పెంచిన ప్రభుత్వంపై సమ్మెకు వెళ్లడం శోచనీయమని సీఎం కేసీఆర్ అన్నారు. ఇంత స్వల్ప వ్యవధిలో ఈ మేర జీతాలు పెంచడం ఏ ప్రభుత్వం చేయలేదనీ, చేయదు కూడా అని ఆయన చెప్పారు. ఆర్టీసీ ప్రస్తుతం 10,400 బస్సులు నడుపుతున్నదనీ, అందులో 2100 అద్దె బస్సులు నడుస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఇప్పుడు కొత్తగా మరో 3000 ప్రైవేట్ బస్సులకు అనుమతిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆర్టీసీ సమ్మె న్యాయబద్దమైంది కాదని లేబర్ కమిషనర్ ఇదివరకే ప్రకటించినట్లు సీఎం గుర్తు చేశారు. పనికిమాలిన డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లారనీ, దేశంలో చాలా రాష్ర్టాల్లో ఆర్టీసీ లేదు. మన రాష్ట్రంలో ఆర్టీసీ బ్రహ్మాండంగా నడుస్తోందనీ.. వారికి గౌరవప్రదమైన వేతనాలు అందించినా సమ్మెకు వెళ్లడం విచారకరమని  ఆవేదన వ్యక్తం చేశారు. 


ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 10,600 రూట్లలో ఇప్పటికే 5,100 రూట్లను ప్రైవేట్ పరం చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. గడువులోపు విధులకు ఎవరూ రాకపోతే మిగతా రూట్లను కూడా ప్రైవేట్ పరం చేస్తామని తేల్చిచెప్పారు. ఇది తన నిర్ణయం కాదని క్యాబినెట్ నిర్ణయమని.. ఇందులో ఏ మార్పు ఉందన్నారు. కార్మికుల కుటుంబాలను ఈ రాష్ట్ర అధినేతగా.. ఒక సోదరుడిలా చెబుతున్నానన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని కార్మికులు వినియోగించుకుని.. తప్పకుండా విధులకు రావాలన్నారు. ఆర్టీసికి 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఇచ్చిన డబ్బులను తమ ప్రభుత్వం ఏడాదిలోనే ఇచ్చామని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: