తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ విధించిన డెడ్‌లైన్ ఆర్టీసీ కార్మికుల్లో క‌ల‌వ‌రాన్ని రేకెత్తిస్తోంది.  ఆర్టీసీ కార్మికులు అంతులేని కోరికలతో సమ్మెకు వెళ్లారని.. ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకూడదని ఇవాళ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు నవంబర్ 5 అర్ధరాత్రి లోగా బేషరతుగా ఉద్యోగాల్లో చేరాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.  కార్మికులకు ఈ సందర్భంగా మరో అవకాశం ఇస్తున్నామని సీఎం అన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం తప్పించుకుంటారని ఆయన తెలిపారు. కాదు కూడదు అంటే సహించే పరిస్థితి లేదని ఆయన కరాఖండిగా తెలిపారు.ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్‌ మీడియాకు తెలుపుతూ...ఈ మేర‌కు స్ప‌ష్టం చేశారు.


మ‌రోవైపు, ఆర్టీసీ జేఏసీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ నెల 9వ తేదీ వరకూ కొత్త ఉద్యమ కార్యాచరణ  ప్రకటించింది. ఆదివారం  అమరుల కోసం పల్లెబాట, సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి తెలిపారు. అలాగే 4న రాజకీయ పార్టీలతో కలిసి డిపోల దగ్గర నిరాహార దీక్ష చేపడతారు. 5న రహదారులు దిగ్భందిస్తారు.. 6న డిపోల ముందు నిరాహార దీక్ష చేస్తారు. 7న ఆర్టీసీ కార్మికులు, రాజకీయ పార్టీల కుటుంబ సభ్యులతో కలిసి డిపోల ఎదుట దీక్షలు చేస్తారు. 8న చలో ట్యాంక్‌బండ్‌కు సన్నాహక కార్యక్రమాలు చేపడతారు. 9న చలో ట్యాంక్‌ బండ్‌ చేపడతారు. 


కాగా, ముఖ్య‌మంత్రి కేసీఆర్ డెడ్‌లైన్ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు క‌ల‌వ‌ర‌పాటుకు గుర‌వుతున్నారు. ఏ నిర్ణ‌యం తీసుకోవాలో స‌మాలోచ‌న‌లు చేస్తున్నారు. కాగా, ఎలాంటి ప్రకటన వచ్చినా కార్మికులెవ్వరూ భయాందోళనకు గురికావొద్దని అశ్వత్థామరెడ్డి కోరారు. కోర్టు ఆదేశాలు, కేబినెట్‌ సమావేశం నేపథ్యంలో తాజా పరిస్థితులపై అన్ని రాజకీయపార్టీలతో సమావేశమై చర్చించినట్లు తెలపారు. ఆయ‌న చేసే ప్ర‌క‌ట‌న‌పై..కార్మికులు భ‌విష్య‌త్ నిర్ణ‌యం ఉండ‌నుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: