పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి అయిదేళ్ళు అవుతొంది. అయితే ఇంతవరకూ పార్టీకి సంస్థాగత నిర్మాణం అంటూ లేదు, ఎక్కడికక్కడ   కమిటీలు వేసి గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని పార్టీ నేతలు కోరుతున్నా పవన్ పట్టించుకోలేదు. ఎన్నికల్లో కూడా అలాగే పోటీ చేశారు. ఇపుడు మరో ఆరు నెలలు గడచిపోయాయి. కానీ కమిటీలు లేవు. జనసేన అంటే పవన్ ఫ్యాన్స్ మాత్రమే కనిపిస్తారు.


ఈ నేపధ్యంలో విశాఖలో ఈ రోజు జరుగుతున్న పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ భారం అంతా టీడీపీయే వహిస్తోందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. దీనిమీద వైసీపీ అధికార ప్రతినిధి గుడివాడ అమర్ నాధ్ మాట్లాడుతూ పవన్ చంద్రబాబు బ్యానర్ మీద సినిమా నటిస్తున్నారని విమర్శించారు. పవన్ బాబు తో కలసి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. పవర్ స్టార్ సినిమాల్లో ఉన్న బిరుదు రాజకీయాల్లో మాత్రం ప్యాకేజ్ స్టార్ గా మారిపోయారని ఘాటైన కామెంట్స్ చేశారు.



జగన్ సీఎం అయితే పేరు మార్చుకుంటానని పవన్ అన్నారని ఇపుడు ఆయన కొత్తగా ఏ పేరు పెట్టుకుంటారని గుడివాడా నిలదీశారు. పవన్ కి ఇసుక కొరత జాతీయ సమస్యగా కనిపించడం విడ్డూరం అన్నారు. వరదల వల్ల ఇసుక తీయడం కష్టంగా ఉందన్న సంగతి ప్రజలకు తెలుసు అని ఒక్క పవన్ కి, చంద్రబాబుకు అర్ధం కావడం లేదని ఆయన విమర్శలు చేశారు. 


ఒక్క సీటు గెలిచిన పిల్ల సేన, 23 సీట్లు గెలిచిన ఇంకుడు గుంతల తెలుగుదేశం పార్టీలు ఎన్ని రకాలుగా రాజకీయ విన్యాసాలు చేసినా కూడా జనం పట్టించుకోరని గుడివాడ అన్నారు. పుస్తకాలు వేలల్లో చదివానని చెబుతున్న పవన్ పోకడలకు  దానికీ ఎక్కడా సంబంధం లేదని కూడా గుడివాడ హాట్ కామెంట్స్ చేశారు. మొత్తానికి గుడివాడ విమర్శలు ఓ విధంగా వేడి పుట్టించాయనే చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: