తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మ‌రోమారు ఆర్టీసీ స‌మ్మె విష‌యంలో భ‌గ్గుమ‌న్నారు. యూనియన్లు పెట్టిన అడ్డగోలు డిమాండ్లతోనే ఆర్టీసీలో స‌మ్మె ప‌రిస్థితి ఎటూ తెగ‌ని స్థితికి వచ్చిందన్నారు. మేం చెడగొడుతం ఎట్ల బతికిస్తరో చూస్తం అన్న చందంగా యూనియన్ల తీరు ఉన్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం పక్షాన మంచి అవకాశం ఇస్తున్నానని.. నవంబర్ 5 అర్ధరాత్రి లోపు.. అంటే మూడు రోజుల్లో బేషరతుగా విధుల్లో చేరినట్లయితే.. రక్షణ, భవిష్యత్తు ఉంటుందని.. లేదూ.. మేం చెడగొట్టుకుంటం.. అట్లనే పోతమంటే.. అందుకు ప్రభుత్వం ఏమీ చేయజాలదని తెలిపారు.


ఈ సంద‌ర్భంగా హైకోర్టు గురించి సైతం కేసీఆర్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. యూనియ‌న్ల నేత‌లు హైకోర్టులో పిచ్చిపిచ్చి మాటలు, అబద్ధాలు చెప్తున్నారని కేసీఆర్ మండిప‌డ్డారు.  తాము తప్పుడు లెక్కలు ఇచ్చినట్లు కోర్టు ఎక్కడా అనలేదని, అడ్వకేట్ మాత్రమే అన్నారని తెలిపారు. కోర్టుకు సమర్పించిన లెక్కల్లో తప్పులు ఉండే ఆస్కారమే ఉండదని చెప్పారు. హుజూర్‌నగర్‌కు ఎంత కేటాయించామన్న దానిమీద హైకోర్టుకు కామెంట్ చేసే అధికారం ఉండదని, ఎక్కడ ఎంత ఇవ్వాల్సి ఉంటుందో నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు.


కాగా, ప్రైవేట్ బస్సులు అన్ని రాష్ర్టాల్లో ఉన్నాయని ఒక్క తెలంగాణలోనే లేవన్నారు. మధ్యప్రదేశ్‌లో ఆర్టీసీని రద్దుచేసే ప్రక్రియను కాంగ్రెస్ సీఎం దిగ్విజయ్‌సింగ్ మొదలుపెడితే.. బీజేపీ సీఎంలు ఉమాభారతి, బాబూలాల్‌గౌర్ పూర్తిచేశారని ఎద్దేవాచేశారు. ఇవన్నీ మరిచి మాట్లాడుతున్న బీజేపీ ఇక్కడచేస్తున్న దుర్మార్గానికి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఏనాడైనా, ఏ రాష్ట్రంలో అయినా ఆర్టీసీని విలీనంచేసిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తా అని ఎన్నికల్లో చెప్తే ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, పంజాబ్ ప్రజలు నమ్మి ఓట్లు వేశారని, మాట నిలుపుకొన్నారా అంటూ నిలదీశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: