మ‌రో తెలుగు టెకీ అమెరికాలో క‌న్నుమూశాడు!అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ నిబంధ‌న‌ల పుణ్య‌మా అని...మ‌న తెలుగు టెకీ తుది శ్వాస విడిచాడు. భారతీయుడు, తెలుగువాడై స్టాఫ్‌వేర్‌ ఇంజినీర్‌ శివ చలపతి రాజు అమెరికాలో అకస్మాత్తుగా మరణించారు. రాజు గ్రీన్‌ కార్డు కోసం కూడా దరఖాస్తు చేశారు. దాని కోసం ఎదురుచూస్తున్న క్రమంలో  ఆయన అకస్మాత్తుగా చనిపోయారు. రాజు అకాల మరణంతో గర్భిణీ అయిన ఆయన భార్య సౌజన్య భారత్‌కు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏం చేయాలో తెలియక ఆమె ఆందోళన చెందుతున్నారు.


రాజు ప్రస్తుతం నార్త్‌ కరోలినాలోని ఒరాకిల్‌ సంస్థలో పనిచేస్తున్నారు. ఆయన గతంలో మిషిగాన్‌లోని విప్రో, ఇల్లినాయిస్‌లోని బ్రిటీష్‌ పెట్రోలియం సంస్థల్లో విధులు నిర్వహించారు. రాజు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు పైడ్‌మౌంట్‌ ఏరి యా తెలుగు అసోసియేషన్‌ (పాటా) గోఫండ్‌మీ పేరుతో విరాళాలను సేకరిస్తున్నది.


కాగా, రాజు కుటుంబం వంటి వారి పరిస్థితికి ఇల్లినాయిస్‌ సెనేటర్‌ డిక్‌ డర్బిన్‌ కారణమంటూ అమెరికాలోని ప్రవాస భారతీయులు మండిపడుతున్నారు.‘అత్యంత నిఫుణుల వలసదారుల చట్టం 2019’ని ఆయన వ్యతిరేకించడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న అమెరికాలోని భారతీయులు, రాజు కుటుంబం దుస్థితిపై ట్విట్టర్‌లో విచారం వ్యక్తం చేశారు. `డర్బిన్‌ వితంతువు`, `డర్బిన్‌ ఆనాథ` పేరుతో తమ ఆవేదనను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. 


కాగా, రాజు మ‌ర‌ణంపై ఇమిగ్రేషన్ అధికారులు స్పందించారు. 'ఈ ఘటన పట్ల మేం విచారిస్తున్నాం. డర్బిన్ సెనేటర్ #S386ను బ్లాక్ చేయలేదు. దీంతో గ్రీన్ కార్డ్ పొందేందుకు వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఉంది. లేదా యూరప్ లో ఉండే వారెవరైనా గ్రీన్ కార్డు దక్కించుకోవచ్చు' అని అధికారులు తెలిపారు. కాగా,  శివ చలపతి రాజు రాజమండ్రిలో చదువుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: