న‌వంబ‌ర్ 5వ తేదీ డెడ్‌లైన్‌తో..ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో...క్షేత్ర‌స్థాయిలో ప‌రిణామాలు మారుతున్నాయి. ప‌లు చోట్ల ఒక‌రిద్ద‌రు కార్మికులు డ్యూటీలో చేరుతున్నారు. మ‌రోవైపు, రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోలు, బస్టాండ్ల వద్ద పోలీసు శాఖ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇదే స‌మ‌యంలో మంత్రులు సైతం కార్మికుల‌కు పిలుపు ఇస్తున్నారు. పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌ మంత్రి గంగుల కమలాకర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాల వల్ల ఆర్టీసీ కార్మికులకు మేలు ఏమీ జరగదని, పార్టీల జెండాలతో వచ్చి వారు ఏమీ చేయలేరని అన్నారు. 


ఆర్టీసీ కార్మికులు యూనియన్ల మాయలో పడొద్దని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌ సూచించారు. బడుగు బలహీన వర్గాలకు చెందినవారే ఆర్టీసీలో ఎక్కువగా పని చేస్తున్నారని నాయకులు జీతాలు లేకుండా ఉండగలరని, కార్మికులు మాత్రం డ్యూటీ చేస్తేనే జీతం వస్తుందన్నారు. ఆర్టీసీ సమ్మెలో ప్రతిపక్షాలు చేరి కార్మికులను రోడ్డున పడేశాయని మండిపడ్డారు. కార్మికులు అందరూ ప్రభుత్వంపై నమ్మకం నుంచి వెంటనే డ్యూటీ లో చేరాలని మంత్రి కోరారు.సీఎం కేసీఆర్ చెప్పినట్లు కార్మికులు విధుల్లో చేరాలన్నారు. 


ఆర్టీసీ డ్రైవర్ బాబు అంతిమయాత్ర గురించి సైతం మంత్రి గంగుల ఘాటుగా స్పందించారు. రాజకీయ నాయకులు చేసిన డ్రామాను ప్ర‌జ‌లు గ‌మ‌నించార‌న్నారు. కరీంనగర్‌లో  హ‌డావుడి చేసిన‌ పెద్ద నాయకులు డ్రైవర్ బాబు కుటుంబానికి కనీసం అంత్యక్రియలకు కూడా ఆర్థిక సహాయం అందించలేదని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని కార్మికులందరూ డ్యూటీ లో చేరాలని కోరారు.


కాగా, డిపోల్లో విధుల్లో చేరే ఆర్టీసీ కార్మికులకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామన్నారు రాచకొండ సీపీ మహేశ్ భగవత్.
ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విధుల్లో చేరే కార్మికులకు ఆటంకం కలిగిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధుల్లో చేరే ఆర్టీసీ కార్మికులకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని చెప్పారు. 
ఆర్టీసీ ఉద్యోగులపై బెదిరింపులు, భౌతికదాడులకు పాల్పడితే వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చని  సైబరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. తెలంగాణ ప్రభుత్వం పిలుపుమేరకు ఉద్యోగులు నిర్భయంగా విధుల్లో చేరవచ్చని, పోలీసుల స‌హాయం అవ‌స‌ర‌మైతే  డయల్ 100 లేదా సైబరాబాద్ పోలీస్ వాట్సాప్ నెం.9490617444 సంప్రదించాలన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: